ఆ ప్లాప్ టాలీవుడ్ హీరోపై అంత డబ్బా... జూదమా.. హిట్ అని నమ్మకమా...?
విరాట్‌కర్ణ తొలి సినిమా పెదకాపు భారీ అంచనాల నడుమ విడుదలై, పెద్ద కాన్వాస్‌లో తెరకెక్కినా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. అందువల్ల విరాట్‌పై “ ఫ్లాప్ హీరో ” అనే ట్యాగ్ పడిపోయింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కొత్త హీరోలు తదుపరి సినిమాలకు నిర్మాతల్ని ఒప్పించడమే కష్టమవుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇప్పుడు విరాట్ కర్ణ నటిస్తున్న ‘ నాగబంధం ’ సినిమాను దర్శకుడు , నిర్మాత అభిషేక్ నామా అంచనాలను మించే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కోసమే రు. 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని సినీ వర్గాల్లో వినిపించే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. “ ఇది పబ్లిసిటీ గిమ్మిక్ మాత్రమే ” అంటున్న వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. “ ఫ్లాప్ హీరో కోసం అంత భారీ బడ్జెట్ అవసరమా ? ” అని కూడా ఇండస్ట్రీలో ఓ వర్గం ప్రశ్నిస్తోంది.
అంత మార్కెట్ లేని హీరో కోసం అతి పెట్టుబడి పెట్టడం జూదమే అని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే దీని వెనక మరో కోణం కూడా ఉంది. అభిషేక్ నామా స్వయంగా ఈ సినిమాకు నిర్మాత. సినిమా వ్యాపారం, నష్ట లాభాల లెక్కలు ఆయనకు బాగా తెలుసు. ఆయన నిర్ణయాల్లో లెక్కలేని రిస్క్ ఉండదని ఇండస్ట్రీ వర్గాలు అంటాయి. అంతేకాదు, డెవిల్ సినిమా కోసం ఆయన మధ్యలో డైరెక్షన్ బాధ్యతలు స్వయంగా తీసుకున్నారు. అభిషేక్ నామాకు ఎప్పటినుంచో దర్శకత్వం పట్ల ఆసక్తి ఉంది. ఆయనకు ఫైన్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం కూడా విజువల్ సినిమాలు చేయాలనే తపన అభిషేక్ నామాకు బలవుతుంది.
ఈసారి హీరో మార్కెట్ కంటే కంటెంట్ మీదే సినిమా పెట్టుబడి పెట్టాలనే నిర్ణయానికి ఆయన వచ్చారని సమాచారం. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ ధోరణి , స్టార్‌హీరో కాకున్నా, కథ బలంగా ఉంటే దేశవ్యాప్తంగా హిట్ అవుతుందనే ధృడ విశ్వాసం నిర్మాతకు నమ్మకం ఇచ్చింది. అందుకే ‘నాగబంధం’ను మొదటి నుంచీ భారీ విజువల్ స్పెక్టకిల్‌గా ప్లాన్ చేశారు. భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాలు, నేలమాళిగలు, పురాతన రహస్యాలు, శాస్త్రీయ - ఆధ్యాత్మిక తత్త్వాల చుట్టూ సాగే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోంది.
ఇలాంటి కాన్సెప్ట్‌లు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉండడంతో దీనిని నేరుగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా విరాట్‌కు, దర్శకుడు అభిషేక్ నామాకు ఈ సినిమా హిట్ అవ్వడం అత్యవసరం. మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.