అహ్మదాబాద్‌లో గురువారం చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం ఏకంగా 265 మంది ప్రాణాలను బలితీసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా.. విమానంలోని మిగతా ప్రయాణీకులు, సిబ్బందితో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా మృతి చెందారు. కాగా, గతంలో ఇటువంటి విమాన ప్రమాదాల్లో కొందరు సినీ తారలు మరణించారు.
ఈ జాబితాలో మొదట గుర్తుకు వచ్చే పేరు సహజ నటి సౌందర్య. 2004 ఏప్రిల్ 17న బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌రావు తరపున కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం చేయడానికి హెలికాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగి సౌందర్య మృతి చెందారు. గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ మరియు పైలట్ సజీవ దహనమయ్యారు.
విమాన ప్రమాదంలో మరణించిన సెలబ్రిటీల్లో బాలనటి తరుణి సచ్దేవ్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ, హిందీ, తమిళ ప్రేక్షుకులకు చేరువైన తరుణి.. పుట్టినరోజు నాడే నేపాల్‌లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో తల్లి గీతా సేచ్దేవ్తో పాటుగా చనిపోయింది. అప్పటికే ఆమె వయసు 14 ఏళ్లే.
రాణి చంద్ర.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత పాపులర్ నటి. మిస్ కేరళ విజేత అయిన రాణి చంద్ర.. మలయాళంలో దాదాపు 70 చిత్రాల్లో నటించారు. తమిళంలో కూడా పలు సినిమాలు చేశారు. అయితే 1976లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 171 ప్రమాదంలో రాణి చంద్ర మృతి చెందారు. రాణి చంద్ర పాటు ఆమె తల్లి మరియు ముగ్గురు సోదరీమణులు కూడా ఆ విమాన ప్రమాదంలో మరణించారు.
భారతీయ నటుడు, ఫ్యాషన్ డిజైనర్ మరియు మోడల్ ఇందర్ ఠాకూర్, ఆయన భార్య, పిల్లలు 1985లో ఎయిర్ ఇండియా కనిష్క-182 విమాన దుర్ఘటనలో మరణించారు. ఉగ్రవాదులు కూల్చేయడంతో ఈ విమాన ప్రమాదంతో ఇందర్ ఠాకూర్ ఫ్యామిలీతో సహా మొత్తం 329 మంది కన్నుమూశారు. అదేవిధంగా 2001 ఆగస్టు 25న బహమాస్‌లో జరిగిన ఫ్లైట్ క్రాష్‌లో 22 సంవత్సరాల గాయని, నటి ఆలియా మరణించారు.