టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన `సంతోషం` మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన గ్రేసీ సింగ్ గుర్తుందా..? నాగార్జున భార్యగా ఫ్లాష్ బ్యాక్ లో ఆమె క్యారెక్టర్ వస్తుంది. సినిమాలో ఉండేది కొద్దిసేపే అయినా తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేసింది గ్రేసీ సింగ్. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఆమె కనిపించలేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. గ్రేసీ సింగ్ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. అసలు గ్రేసీ సింగ్ ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు..? 2015 నుండి సినిమాలకు ఎందుకు దూరమైంది..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలో జన్మించిన గ్రేసీ సింగ్.. కేవలం నటి మాత్రమే కాదు భరతనాట్యం మరియు ఒడిస్సీ నృత్యకారిణి కూడా. 1997లో `అమానత్` అనే టీవీ సీరియల్ లో గ్రేసీ సింగ్ తొలిసారి కనిపించింది. 1999లో `హు తు తు` అనే హిందీ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆస్కార్ నామినేషన్ పొందింన `లగాన్` మూవీతో గ్రేసీ సింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం 2001లో రిలీజ్ అయింది. లగాన్ తర్వాత బాలీవుడ్ లో గ్రేసీ సింగ్ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. అదే సమయంలో `సంతోషం` మూవీతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆపై `తప్పు చేసి పప్పు కూడు`, `రామ రామ కృష్ణ కృష్ణ` తదితర చిత్రాల్లో మెరిసింది. హిందీ, తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో 2015 వరకు గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో వెండితెరకు దూరమై.. బుల్లితెరపై అడపా తడపా సీరియల్స్ చేసింది. 2021 నుండి సీరియల్స్ కూడా మానేసి యాక్టింగ్ కు ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పింది. ఇకపోతే 2013లో గ్రేసీ సింగ్ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లారు. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాగే తన పేరుతో గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్ కూడా ప్రారంభించి దేశ విదేశాలలో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే 44 ఏళ్లు వచ్చినా గ్రేసీ సింగ్ వివాహం చేసుకోలేదు. తన జీవితాన్ని నాట్యం, నటన మరియు ఆధ్యాత్మికతకు అంకితం చేసుకుని గ్రేసీ సింగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారని అంటుంటారు.