గోపీచంద్ సినిమాను ప్రభాస్ వదిలేసినట్టేనా .. ?
యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గోపీచంద్ గత కొంతకాలంగా వరుసగా డిజాస్టర్ సినిమాలతో కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నాడు. గోపీచంద్ చివరిగా విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అటు గోపీచంద్ .. ఇటు దర్శకుడు శ్రీను వైట్ల ఇద్దరూ కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు. వీరికి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇటీవల కాలంలో లేదు. అందుకే విశ్వం సినిమా పై ఇద్దరు భారీ ఆశలు పెట్టుకుంటే అవి నెరవేర లేదు. ఇక గోపీచంద్ కు బ్లాక్ బస్టర్ హిట్టు వచ్చి చాలా యేళ్లు అవుతోంది. చివరిసారిగా పదేళ్ల క్రితం లౌక్యం సినిమాతో 2014లో గోపీచంద్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ నంద - సిటీ మార్ - బీమా సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి.
మిగిలిన సినిమాలు ఏవి మెప్పించలేదు. అయితే తనకున్న మాస్ ఇమేజ్ కారణంగా నిర్మాతలు గోపీచంద్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక గోపీచంద్ కు ప్రభాస్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు ప్రభాస్ తెరవెనక ఉండి గోపీచంద్ హీరోగా జిల్ సినిమాను నిర్మించారు. రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం గోపీచంద్ కష్టాల్లో ఉండడంతో ప్రభాస్ తో పాటు ప్రభాస్ స్నేహితులు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.
అయితే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ ఇబ్బందుల్లో ఉంది. చిరంజీవితో చేస్తున్న యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న విశ్వంభర సినిమా మీద ఈ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. వచ్చే యేడాది మేలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు బిజినెస్ జరిగితే తప్ప మరో సినిమాకు యూవీ క్రియేషన్స్ పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అందుకే గోపీచంద్ తో చేయాల్సిన ప్రాజెక్టును యు వి క్రియేషన్స్ వదులుకుందని ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుని 70 ఎంఎం టేకోవర్ చేసినట్టు తెలుస్తోంది.