అక్కినేని నాగేశ్వరరావు తనయుడు వెంకట్ అక్కినేని, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించారు. తనపని తాను చేసుకుంటూ వెళ్లే ఆయన, మొదటి నుంచి కూడా మీడియాకి దూరంగానే ఉంటూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను .. నాగార్జున ఇద్దరం కూడా ఇండస్ట్రీలో పెరగలేదు. మేము బాగా చదువుకోవాలని చెప్పి, మమ్మల్ని నాన్నగారు ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతూ వచ్చారు. అందువలన అప్పట్లో సినిమాలను గురించి మాకు ఏమీ తెలిసేది కాదు. సినిమాలకి సంబంధించిన ఆలోచనలను నాన్నగారు మాపై రుద్దే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేసేవారు కాదు" అని అన్నారు. "నేను నిర్మాతగా మారడానికీ .. నాగార్జున హీరో కావడానికి కూడా భయపడుతూనే నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాము. అప్పుడు మాత్రం ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తరువాత చాలాకాలం పాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకున్నాను. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని భావించి నేను పక్కకి తప్పుకున్నాను. ఇప్పుడు నాగార్జున ఆ వ్యవహారాలు చూసుకుంటున్నాడు" అని చెప్పారు.ఇదిలావుండగా ఎన్టీఆర్ గారితో మీ నాన్నగారికి గొడవలు ఉండేవని అప్పట్లో అందరూ అనుకున్నారు కదా.. మీరు దాని గురించి ఏం చెబుతారు? అన్న ప్రశ్నకు వెంకట్ స్పందిస్తూ.. "అవును మీరన్నది నిజమే. మా నాన్నగారికి ఎన్టీఆర్ గారితో గొడవలు ఉండేవి. కానీ అవి అంతా మర్చిపోయి, తర్వాత వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మా ఇంటికి కూడా చాలాసార్లు ఆయన వచ్చేవారు. మా ఇంటి ఫుడ్ అంటే ఆయనకి చాలా ఇష్టం. మా నాన్నగారితో పాటు ఆయన్ని కూడా కొడుకు లాగా మా నాయనమ్మ గారు చూసుకునేవారు. మా ఇంటి పెద్ద కొడుకు వచ్చాడు అని ఎన్టీఆర్ గారిని చాలా గౌరవంగా చూసుకునేవారు. ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మీ ఇంటి భోజనం నాకు చాలా నచ్చుతుందని చెప్పడం, మేము చాలా సార్లు విన్నాం. ఇక గొడవలు అంటారా.. అవన్నీ ఇండస్ట్రీలో ఉండే గొడవలే గానీ పర్సనల్ గా వాళ్ళ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు. వాళ్లు మంచి ఫ్రెండ్స్ లాగా, అన్నదమ్ముల్లాగా ఉండేవారు" అని తెలిపారు.