వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొంతకాలం క్రితం రవితేజ హీరోగా "RT 75" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మొదట వార్తలు వచ్చిన ఆ తర్వాత ఈ సినిమా సంక్రాంతి బారి నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
దానితో అసలైన పోరు చిరు , వెంకీ ల మధ్య సంక్రాంతికి ఉంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ రసవత్తరమైన పోరులోకి బాలయ్య కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ , బాబి దర్శకత్వంలో "NBK 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మూవీ బృందం అనుకుంటున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇదే కానీ జరిగితే 2001 వ సంవత్సరం జరిగిన సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవి పుత్రుడు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో మృగరాజు ఫ్లాప్ కాగా , దేవి పుత్రుడు యావరేజ్ విజయాన్ని అందుకుంది. నరసింహా నాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.