మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక కలకలం రేపుతోంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య గురించి ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా మొత్తం మాట్లాడుకుంటుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ఎత్తిచూపుతూ జస్టిస్ హేమ ప్యానెల్ నివేదిక విడుదలైంది. దీంతో చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. మలయాళ చిత్రసీమలో పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులపై లైంగిక ఫిర్యాదులు రావడం మొదలైంది.హేమ కమిటీ నివేదిక తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మెగాస్టార్ మోహన్‌లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ మూకుమ్మడి రాజీనామాల నిర్ణయంపై హీరోయిన్ పార్వతి స్పందించారు. ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న మోహన్‌లాల్ వైదొలగడం ఎంత పిరికితనం అని విమర్శించారు. అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని పేర్కొన్నారు.అమ్మ సంస్థ నిర్వాహకుల ఈ చర్యపై నటి పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసింది. నిరంతర లైంగిక ఫిర్యాదుల నేపథ్యంలో మలయాళ నటీనటుల సంఘం అమ్మ నుంచి మోహన్‌లాల్‌తో సహా ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని నటి పార్వతి విమర్శించారు.
దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ వార్త వినగానే నేను షాక్ అయ్యాను.ఇది ఎంత పిరికితనం.. అంటే. ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న వాళ్లు పిరికితనంతో బాధ్యత నుంచి ఎలా తప్పుకుంటారు.? అని ప్రశ్నించింది పార్వతి. అలాగే ఆమె మాట్లాడుతూ.. మలయాళ నటీనటుల సంఘం (అమ్మ)లోని వ్యక్తులు ఎలా పని చేస్తారో నాకు బాగా తెలుసు. అక్కడ మా అవసరాల గురించి మాట్లాడే హక్కు నాలాంటి నటీమణులకు లేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే మెరుగైన నాయకత్వం అవసరం. రాబోయే కాలంలోనైనా ప్రతి ఒక్కరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పుకొచ్చింది.ఈ నేపథ్యంలో టాలివుడ్లో కూడా అప్పుడప్పుడు ఒకటి అరా ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ మలాయళ సినీ పరిశ్రమలో వచ్చినంతగా రాలేదు. గతంలో ఒకరిద్దరు నటుల విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ తర్వాత వాటికి పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. అదీగాక మాలివుడ్లో బహిరంగంగా ఫిర్యాదులు చేసినట్టు టాలివుడ్లో ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవనే చెప్పాలి. తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలో నటి మాధవీ లత, రాధికా ఆప్టే వంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారెవ్వరూ బహిరంగ వ్యాఖ్యలు చెయ్యలేదు.