ఎవరు అసలైన పాన్ ఇండియా స్టార్.. సోషల్ మీడియాలో ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్ ఫ్యాన్స్ వార్!

Suma Kallamadi
బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ స్థాయి మారిపోయింది. అప్పటి వరకు బాలీవుడ్ స్టార్లు అనుకున్న హీరోలు సైతం కుళ్లుకునేలా కనీవినీ ఎరుగని కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రభాస్ సినిమాలు వరుసగా కోట్ల వసూళ్లు కురిపిస్తున్నాయి. బాహుబలితో పాటు ఇటీవల విడుదలైన కల్కి సినిమా రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన దక్షిణాది హీరో ప్రభాస్ ఒక్కడే. ఆ తర్వాత భాషా భేదం లేకుండా అన్ని సినిమాలు హిందీ, ఇతర భాషల్లో విడుదల అవుతున్నాయి. రాజమౌళి అలాంటి ప్లాట్‌ఫారం ఏర్పరిచాడు. ప్రభాస్‌తో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లుగా మారారు. వారి సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ మధ్య కొత్త యుద్ధం మొదలైంది. తమ హీరో అసలైన పాన్ ఇండియా స్టార్ అంటూ ఆయా స్టార్ హీరోల ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు యావరేజ్ అయినా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సైతం కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. దీంతో వారిద్దరు కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. వారి తరువాతి సినిమాలు సైతం పాన్ ఇండియా తరహాలో రూపొందుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప దేశంలోని సినీ ప్రియులను ఓ ఊపు ఊపింది. దిగ్గజ రాజకీయ నేతలు సైతం పుష్ప డైలాగ్‌లను తమ ప్రచారంలో వాడారు. అంతగా పుష్ప డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ప్రభాస్, తారక్, చరణ్ ముగ్గురూ రాజమౌళి సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్లుగా మారారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. తమ హీరో ఇండివిడ్యువల్‌గా పైకి వచ్చాడని, రాజమౌళి సినిమాలో నటించకపోయినా పాన్ ఇండియా స్టార్ అయ్యాడని వారు చెబుతున్నారు. కాబట్టి అల్లు అర్జున్ మాత్రమే అసలైన పాన్ ఇండియా స్టార్‌గా అభివర్ణిస్తున్నారు. దీనికి మిగిలిన హీరోల ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా కేవలం రూ.300ల కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. కనీసం రూ.500ల కోట్లు కూడా దాటలేదని చెబుతున్నారు. ఇలా టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో డైలాగ్ వార్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: