సీతా కళ్యాణ వైభోగమే రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..!?

Anilkumar
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు డ్రీమ్ గేట్స్ బ్యానర్‌ను ప్రారంభించాడు నిర్మాత రాచాల యుగంధర్. ఈ క్రమంలో సుమన్ తేజ్, గరిమ చౌహాన్ అనే కొత్త హీరో హీరోయిన్లతో సీతా కళ్యాణ వైభోగమే అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రానికి సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జూన్ 21న విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ కథ, కథనాలు ఏంటో ఓ సారి చూద్దాం.
కథ
ఊరి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న రామ్ (సుమన్ తేజ్), సీత (గరిమ చౌహాన్)లు ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటారు. అయితే రామ్ తండ్రి మూర్తి (శివాజీ రాజా) చావు అంచులకు వెళ్తుంటాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న మూర్తి చివరి కోరికగా.. సీతను ఆమె తండ్రి జానకి రామయ్య (నాగినీడు)తో కలిసేలా చేయమని, ఆ కుటుంబంతో సీతను కలపమని కోరతాడు. తాను గొప్పగా, గౌరవంగా బతికిన ఊర్లోనే దహన సంస్కారాలు చేయమని, తన అంతిమ యాత్రను కూడా అంతే గౌరవంగా చేయించమని కొడుకుని కోరతాడు. దీంతో రామ్, సీతలు మళ్లీ ఊళ్లోకి అడుగుపెడతారు. సీత కోసం ఎదురుచూస్తున్న పరమ దుర్మార్గుడు రమణ (గగన్ విహారి) ఏం చేస్తాడు? సీతను, రామ్‌ను ఎలా ఇబ్బంది పెడతాడు? అసలు ఆ ఊరి గుడి ఎందుకు మూసి ఉంటుంది? శ్రీరామనవమికి ఊర్లో ఉండే కట్టుబాట్లు ఏంటి? జానకి రామయ్య తన కూతురి ప్రేమను అర్థం చేసుకుంటాడా? చివరకు రామ్ ఏం చేస్తాడు? రమణ ఆగడాలను ఎలా అంతం చేస్తాడు? అన్నదే కథ.
నటీనటులు
సుమన్ తేజ్‌, గరిమ చౌహాన్‌ల జంట తెరకు కొత్తది. స్క్రీన్ మీద నటించడం ఈ ఇద్దరికీ కొత్తే. కానీ ఈ జంట అలా అనిపించదు. రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో ఈ ఇద్దరూ ఆకట్టుకుంటారు. యాక్షన్ సీక్వెన్స్‌లో సుమన్ తేజ్ మెప్పిస్తాడు. విలన్‌గా రమణ పాత్రలో  గగన్ విహారి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడు. తెరపై ఆ పాత్రని చూస్తే ప్రేక్షకుడికే చంపేయాలనేంత కోపం వస్తుంది. నాగినీడు రెగ్యులర్ తండ్రి పాతలా అనిపిస్తుంది. మూర్తిలో మోడ్రన్ ఫాదర్ కారెక్టర్‌లు కనిపిస్తాయి. ఊర్లో కనిపించే మిగిలిన కారెక్టర్లు పర్వాలేదనిపిస్తాయి. దేవరాజ్ పాలమూరి, శ్రీకాంత్, ధర్మా రెడ్డి తమ పాత్రల్లో బాగా నటించారు.
విశ్లేషణ
రామాయణం, రాముడు సీత విలువలు చెప్పేందుకు, మరిచిపోతోన్న మన సంస్కృతిని చెప్పేందుకే ఈ సినిమాను తీస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రమోషన్స్‌లో చెప్పారు. ఈ మూవీని చూస్తే వాళ్లు చెప్పింది అక్షర సత్యమనిపిస్తుంది. మనం ఎలా ఉండాలి? ఎలా జీవించాలి?.. ఎలా జీవిస్తున్నామనేది చూపించారు. ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా శ్రీరాముడ్ని ఎందుకు కొలుస్తున్నామో చెప్పకనే చెప్పేశారు.
ప్రస్తుతం తరం ప్రేమ పేరుతో ఏం చేస్తుంది.. ప్రేమిస్తే పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారు అనే విషయాన్ని చూపించారు. పెళ్లికి ఉన్న అర్థాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదా సరదాగా సాగుతుంది. ఊరి వాతావరణం, హీరో ఫ్రెండ్స్.. కామెడీ సీన్లు, ప్రేమ పాఠాలు ఇలా సరదాగా సాగుతుంటుంది. మధ్యలో విలన్ మార్క్ సీన్లు కనిపిస్తాయి. ఇంటర్వెల్‌కు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని అనుకుంటారు. కానీ చిన్న ట్విస్ట్ తరువాత తెలుస్తుంది.
సెకండాఫ్‌లో రమణ చేసే వికృత చేష్టలు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, తండ్రి కోసం కొడుకు చేసే పనులు.. ఇలా కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. టెక్నికల్‌గా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. విజువల్స్ సహజంగా ఉంటాయి. ఊరి వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఆర్ఆర్ బాగుంది. చరణ్ అర్జున్ పాటలు వినసొంపుగా ఉంటాయి. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. రాముడు, రామాయణ, మహిళల గొప్పదనం వివరించే డైలాగ్స్ బాగుంటాయి. నిర్మాత రాచాలా యుగంధర్ పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. డ్రీమ్ గేట్స్ బ్యానర్ మొదటి సినిమానే చక్కని విలువలతో కూడిన సినిమా నిర్మించి మెప్పించింది.
రేటింగ్ 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: