ఒమిక్రాన్ : మళ్లీ సినిమా కష్టాలు..! కానీ..
మళ్లీ చీకటి రానుంది
వెలుగు వెంటే చీకటి
సినిమా వాళ్లకు ఇదొక పెనుత్పాతం కూడా!
ఇకపై ఆంధ్రాలో యాభై శాతం ఆక్యుపెన్సీతో
థియేటర్లు మరియు నైట్ కర్ఫ్యూ
ఆ వివరం ఈ కథనంలో...
ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.కొత్త కేసుల నమోదు రోజురోజుకూ పెరిగిపోతోంది.ముఖ్యంగా సంక్రాంతి సందడి నేపథ్యంలో కరోనా కేసుల మరింత పెరిగాయి.పల్లెల నుంచి నగరాలకు చేరుకున్న వారికి కరోనా పాజిటివ్ అని తేలుతోంది.టెస్టుల సంఖ్య పెంచాలని అటు ఏపీలోనూ,ఇటు తెలంగాణలోనూ పబ్లిక్ డిమాండ్ ఒకటి వినిపిస్తుంది.పండగ ముగిసినా కూడా జాతరల పేరుతో సందడి నెలకొని ఉంది.దీంతో కరోనా వ్యాప్తి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో సినిమాల నడక,వాటి విడుదల,ప్రీరిలీజ్ వేడుకలు ఇవన్నీ కూడా చాలా కష్టతరంగా మారనున్నాయి.ఇప్పటికే యాభై శాతం ఆక్యుపెన్సీ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మంగళవారం నుంచి అది అమలు కానుంది.అదేవిధంగా నైట్ కర్ఫ్యూను కూడా నేటి నుంచే అమల్లో ఉంచనున్నారు.ఈ రెండు నిర్ణయాల ప్రభావం సినిమాలపై తీవ్రంగా పడనుంది.పండగ సినిమాలు విడుదలై ఇంకా వారం కూడా కాలేదు కనుక కలెక్షన్ల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోనుంది.3 షోల కారణంగా పెద్దగా బీ,సీ సెంటర్లలో డబ్బులు వచ్చే సీన్ లేనే లేదు.ఇవన్నీ కొత్తగా విడుదలయిన బంగార్రాజు పై అదేవిధంగా హీరో, రౌడీబోయ్స్ సినిమాలపై ప్రభావం చూపే అవకాశాలే మెండు.పుష్కలం.
ఈ తరుణంలో సినీ ఇండస్ట్రీ వర్గాలు పూర్తిగా ఓటీటీవైపు దృష్టి సారిస్తున్నాయి.వచ్చే రోజుల్లో థియేటర్ కన్నాఓటీటీనే బెటర్ అన్న ఆప్షన్ కు వచ్చేశాయి.ఇప్పటికే పెద్ద సినిమాలు విడుదలయిన నెల రోజులకు ముందే ఓటీటీలో సందడి చేస్తున్నాయి.డిసెంబర్ 17న పుష్ప విడుదలయితే జనవరి ఏడున ఓటీటీలో సందడి చేసింది.ఓటీటీ కూడా సినిమా వాళ్లకు మంచి లాభాలనే ఇస్తుంది. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు (అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్)తో పాటు స్థానిక మీడియా ఆహా లాంటివి కూడా ఓటీటీ పరంగా బాగానే బిజినెస్ చేస్తున్నాయి.కొన్ని సినిమాలు థియేటర్ల కన్నా ఓటీటీల దగ్గరే మంచి టాక్ తో పాటు రెవెన్యూ దక్కించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ ను ఎక్కువగా అందించేందుకు,థియేటర్ ను మెయిన్ స్ట్రీమ్ నుంచి తప్పించేందుకు, ముఖ్యంగా ప్రభుత్వాలతో ఉన్న తలనొప్పులు తగ్గించుకునేందుకు ఇండస్ట్రీ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోంది.అవన్నీ సఫలీకృతం అయితే కరోనా కష్టాల నుంచి ఒడ్డెక్కడం సులువు.