ట్రోలింగ్ : రెమ్యునరేషన్ పై ఆర్కే నీతులు! ఎందుకంటే ?
"హీరోలంతా రెమ్యునరేషన్ తగ్గించుకునే సమయం వచ్చేసింది. మీదాకా మీరు తగ్గించుకుని, తగిన సమయం వచ్చినప్పుడు పెంచుకోండి" అంటూ ఓ ఉచిత సలహా నిన్నటి వేళ విసిరేశారు ఏబీఎన్ రాధాకృష్ణ. ఆంధ్రావనిలో టికెట్ రేట్ల తగ్గింపుపై గత కొద్దిరోజులుగా వివాదం రేగుతున్న తరుణాన ఆర్కే చెబుతున్న సుద్ధులు వివాదాలకు తావిస్తున్నాయి. తాము మార్కెట్ కు అనుగుణంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నామని నలుగురు హీరోలు మినహా మిగతావారికి ఇండస్ట్రీ నుంచి పెద్దగా దక్కేదేమీ లేదు అని ఇంకొందరు అంటున్నారు. అయినా తమ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుని నటిస్తే రేపటి వేళ అదే స్థాయిలో సినిమా మార్కెట్ జరిగితే నిర్మాతకు లాభమే కానీ ఒకవేళ నష్టాలు వచ్చినప్పుడు కూడా ఇచ్చిన కొద్దో గొప్పో పారితోషకాన్ని వదులుకోమంటే అప్పుడు వాళ్లేం కావాలి అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. ఒక నిర్మాత తనకు వచ్చిన లాభాలను హీరోలకు కానీ ఇతర సాంకేతిక నిపుణులకు కానీ పంచనప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో జాగ్రత్తలు వహించాలని కూడా అభిమానులు హితవు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిమితి లో హీరో కూడా ఓ నిర్మాతగానే ఉన్నందున వీలున్నంత వరకూ నిర్మాత కష్టాలను పంచుకుంటున్న వారే అగ్ర హీరోలలో ఉన్నారని, ఆ జాబితాలో ముందుండేది పవన్ మాత్రమేనని అంటున్నారు మెగాభిమానులు.
హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకుని తీరాలని చెబుతున్న వైసీపీకి కూడా పవన్ అభిమానులు మంచి కౌంటర్ ఇస్తున్నారు. అయితే మీరు మీ భారతీ సిమెంట్ కట్ట 400కు పైగా అమ్ముకుంటున్నారు కదా దానిని వంద రూపాయలకే ఇవ్వండి అని అంటున్నారు. సో..రాధాకృష్ణ చెప్పిన మేరకు రెమ్యునరేషన్ల తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్న హీరోలు చాలా తక్కువ మందే ఎందుకంటే ఓ నిర్మాత తనకు తన మార్కెట్ కు ఉన్న పరిధి మేరకు సినిమా నిర్మించి వివిధ దారుల్లో ఆదాయం వెతుక్కుంటారు. కనుక పెద్ద హీరోలు రెమ్యునరేషన్ కాస్త తగ్గించుకోవడంతో సినిమాలు సేఫ్ జోన్ లో ఉంటాయన్నది వాస్తవమే కానీ ఆ పని ఇప్పటికిప్పుడు ఎవ్వరూ చేయరు..చేయలేరు కూడా! ఇప్పుడు తగ్గించి రేపు పెంచమన్నా ఏ నిర్మాతా అందుకు సిద్ధంగా ఉండడు కూడా!