నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే..! బాలయ్యకున్న మాస్ ఇమేజ్ను సరైన స్థాయిలో ఉపయోగించుకోగల పవర్ఫుల్ సబ్జెక్ట్ పడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో మరోసారి నిరూపించిన చిత్రమిది. అంతేకాదు.. కోవిడ్ పాండమిక్ దారుణంగా దెబ్బ తీసిన తరువాత తిరిగి విశేష సంఖ్యలో జనాలను థియేటర్లకు రప్పించి పరిశ్రమకు ఊపిరిలూదిన చిత్రమిది. ఈ చిత్ర విజయం తరువాత మరోసారి టాలీవుడ్లో సీనియర్ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలను గురించిన చర్చ మెదలైంది. నిజానికి గత తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు స్టార్ హీరోలుగా ఉన్న సమయంలో విరివిగా వచ్చిన మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ తరువాత తరం అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల హయాంలో మాత్రం ఇది సాధ్యపడలేదు. దీనికి పలు కారణాలున్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం అభిమానుల మధ్య క్లాష్ రాకూడదన్న భయమే. కథను సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతే అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సివస్తుందని ఇటు హీరోలు, అటు దర్శకులు అలాంటి సాహసానికి పూనుకోలేదు. నిజానికి ఇది టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమని చెప్పలేం. ఎప్పుడో మూడు దశాబ్దాలకు పూర్వం దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన దళపతి చిత్రంలో నిజానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో స్టార్ హీరో కమల్‌హాసన్ నటించాల్సి ఉండగా ఆతర్వాత కమల్‌హాసన్ స్థానంలో మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టి వచ్చి చేరాడు. దీనికి కారణంగా అప్పట్లో మణిరత్నం చెప్పిందేమిటంటే అభిమానుల మధ్య యుద్ధం రాకూడదనే.
అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మార్పు వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మల్టీస్టారర్లను ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తెరకెక్కించగలమనే నమ్మకాన్ని కలిగిస్తున్న రాజమౌళి లాంటి దర్శకులే ఇందుకు కారణం. తారక్, చెర్రీలతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరు, బాలయ్యలతో కూడా మల్టీస్టారర్ వస్తే బాగుంటుందన్న చర్చ సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానుల్లో మొదలైంది. అంతేకాదు.. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ బాలయ్య కార్యక్రమంలో రాజమౌళిని నాతో సినిమా ఎప్పుడు చేస్తున్నారని నందమూరి హీరో అడగడం దానికి ఎపిసోడ్లో సమాధానం చెబుతానని జక్కన్నచెప్పడం ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి ఈ ఇద్దరు హీరోలను కలిపి ఓ సినిమాను తెరకెక్కించగల సత్తా రాజమౌళికి ఉంది. మరి ఇది ఎంతవరకు సాకరమవుతుందో వేచిచూడాల్సి ఉంది.