సినిమా లవర్స్ కు పండగే పండగ.. ఫెస్టివల్ సీజన్ లేకుండానే..!
రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి 'క్రాక్'తో మాస్ హిట్ కొట్టాడు. ఈ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కాడు రవితేజ. ఇక ఇదే జోష్‌తో రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చేశాడు. ఇప్పటికే వచ్చిన టీజర్స్‌తో 'ఖిలాడి'పై మంచి బజ్ మొదలైంది. ఈ సినిమాని ఫిబ్రవరి 11న రిలీజ్ చెయ్యబోతున్నారు నిర్మాతలు. మహేశ్ బాబు నిర్మాణంలో అడివి శేషు హీరోగా చేస్తోన్న సినిమా 'మేజర్'. ముంబాయి 26/11 ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతోందీ సినిమా. తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతోంది.మార్చిలో స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ టెన్షన్‌లో ఉంటారు. థియేటర్ల వైపు చూసే విధ్యార్థులు తక్కువగా ఉంటారు. అందుకే సమ్మర్ హంగామా ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. అయితే ఈ ఏప్రిల్‌కి పెద్ద సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది. అందుకే చాలామంది హీరోలు ఫిబ్రవరిని టార్గెట్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తోన్న సినిమా 'ఎఫ్3'. ఫ్యామిలీ హిట్ 'ఎఫ్2' సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతోంది. అసలైతే ఈ సినిమా సంక్రాంతికే రావాల్సింది. కానీ 'ఆర్ ఆర్ ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్' సినిమాలతో కాంపిటీషన్ పెరిగిపోయింది. దీంతో కలెక్షన్లు డివైడ్ అవుతాయని ఈ సినిమా ఫిబ్రవరికి మార్చారట మేకర్స్.నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్‌లో వస్తోన్న సినిమా '18 పేజెస్'. సుకుమార్ కథతో పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతోంది. గీతా ఆర్ట్స్2లో నిర్మాణమైన ఈ సినిమా ఫిబ్రవరి 18న బరిలో దిగుతోంది. ఫిబ్రవరిని సినిమాల సీజన్‌గా మార్చుతోన్న ఈ హీరోలు బాక్సాఫీస్ కూడా ఇదే రేంజ్‌లో సందడి చేస్తే సమ్మర్‌కి సూపర్‌హిట్ స్టార్టింగ్ వస్తుందని చెప్పొచ్చు. పాండమిక్‌తో చాన్నాళ్లుగా స్లీపింగ్ మోడ్‌లో ఉన్న బాక్సాఫీస్‌కి మరింత ఎనర్జీ వచ్చే అవకాశముంది. సంక్రాంతి ఫీవర్‌ని కంటిన్యూ చేస్తూ పరిశ్రమకి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు. మరి ఈ హీరోలు ఏం చేస్తారో చూడాలి.