ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చాలా రచ్చ గా మారాయి. అసలు ఈ సారి మా ఎన్నికల్లో జరిగినంత రచ్చ, విమర్శలు , వాదోపవాదాలు ఈ ఎన్నికల్లోనూ జరగలేదు. హోరాహోరీగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై ఏకంగా 100 కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మా ఎన్నికల కు ముందు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ ఫ్యానెల్స్ మధ్య తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక అందరం కలిసి పని చేద్దామని పైకి చెపుతున్నా ఎవ్వరూ కూడా వెనక్కు తగ్గకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పట్లో వదిలేలా లేరు. ఈ రెండేళ్లు తాను విష్ణును నీడలా వెంటాడుతూ ఆయన ఇచ్చిన హామీలు అన్ని అమలు అయ్యేలా చేస్తామని చెపుతూ వస్తున్నారు. తాజాగా ఈ రోజు ప్రకాష్ రాజ్ మా ఎన్నికలపై మరో బాంబు పేల్చారు. మా ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీ జోక్యం ఉందని ఆయన మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన మా ఎన్నికల్లో అవక తవకలు జరిగాయంటూ .. ఎన్నికల సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇక ఈ రోజు వైసీపీ ప్రభుత్వంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. ఎన్నికల హాలులోకి వైసీపీ కార్యకర్త నూకల సాంబశివరావును ఎలా ? అనుమతి ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. సాంబశివరావు ఎన్నికల హాలులో ఓటర్లను బెదిరించా రంటూ ఆయన మండి పడ్డారు. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటో లు బయట పెట్టి న ఆయన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటకు చెందిన సాంబ శివరావు పై ఇప్పటి కే క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని ఆయన చెపుతున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు ఉన్నాయని.. వాటిని త్వరలోనే బయట పెడతానని ఆయన చెపుతున్నారు.