తల్లితండ్రులపై కేసు వేసిన తమిళ హీరో విజయ్...

VAMSI
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కెరీర్ లో ముందు దూసుకుపోతున్నాడు. సినిమాల గురించి కాకుండా ఈ మధ్య ఇతర విషయాలలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ సైతం విజయ్ గురించి కంగారు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇన్కమ్ టాక్స్ చెల్లించడం లేదన్న విషయమై కోర్టులో కేసు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ కేసు నుండి విముక్తి కలిగింది. ఇప్పుడు ఒక వ్యక్తిగత విషయమై విజయ్ అవతల వారిపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ రోజు చెన్నై సివిల్ కోర్టులో 11 మందిపై ఫిర్యాధు చేశారు. కారణం ఏమిటంటే, తన అనుమతి లేకుండా తన పేరును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారని కేసులో విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే ఆశ్చర్యకరంగా కేసులో ఉన్న లిస్ట్ లో విజయ్ తల్లితండ్రులతో పాటుగా మొత్తం 11 మంది ఉన్నారు.  ఈ ఫిర్యాదులో హీరో విజయ్ తనకు ఇలాంటివి అస్సలు నచ్చవని, ఏమైనా చేసే ముందు నాకు తెలియచేయడం అనివార్యం అని, కానీ ఎటువంటి సమాచారం లేకుండా నా పేరుపై ఎటువంటి కార్యక్రమాలు ఇక ముందు చేయకుండా ఉండడానికి ఇలా చేస్తున్నానని ఫిర్యాదులో చెప్పారు. అయితే ఇదే విధంగా ఒక సంవత్సరం క్రితం ఒక సంఘటన జరిగింది. విజయ్ తండ్రి మరియు డైరెక్టర్ అయిన ఎస్ ఏ చంద్రశేఖర్ ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయ్యకం అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీని పెట్టడం జరిగింది. ఈ పార్టీకి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ మరియు ఆయన భార్య శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా బాధ్యతలను చూసుకుంటున్నారు.
అయితే ఈ పార్టీపై అప్పుడే విజయ్ ఒక ప్రకటన చేసినట్లు అందరికీ తెలిసిందే. ఆ ప్రకటనలో, ఈ పార్టీతో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ నాకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇందులో నా అభిమానులు ఎవరూ కూడా చేరవద్దని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి నన్ను ఏవిధముగా అయినా ఉపయోగించినా వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. కానీ ఈ విషయంపై పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ సరిగా అర్ధం చేసుకున్నట్లు లేరు. కొడుకే కదా అని చేసిన పార్టీ కార్యక్రమాలకు ఇప్పుడు కేసును ఎదుర్కోవలసి వస్తుంది. మరి ముందు ముందు ఈ కేసులో ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 27 న ఈ కేసుపై విచారణ జరగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: