ఇండియా లో ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ సూపర్ హీరో సినిమాలు తీసేందుకు మాత్రం ఇప్పటి వరకూ ఏ దర్శకుడు సాహసం చేయలేదు. అయితే త్వరలో మన ముందుకు సూపర్ హీరో సినిమా కూడా రాబోతుంది. విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఆ సాహసం చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుని మెగాస్టార్ లాంటి హీరోలతో సినిమాల్లో నటించి ప్రస్తుతం హీరోగా ఎదిగిన తేజ సజ్జ ఈ సూపర్ హీరో సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను భారత పౌరాణికం రామాయణంలోని సూపర్ హీరో హనుమంతుడి పాత్ర పేరుతో మరియు హనుమంతుడి పాత్రను రోల్ మాడల్ గా తీసుకుని హనుమాన్ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేయగా గ్రాఫిక్స్ తో డిఫరెంట్ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సూపర్ హీరో సినిమా హనుమాన్ కు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్ కాగా ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. టీజర్ లో తేజ సజ్జ డిఫరెంట్ లుక్ లో..డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తున్నారు. తేజ సజ్జ వీడియోలో కొండల పై నుండి దూకుతూ వస్తూ వేటలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం భారీ గ్రాఫిక్స్ ను ఉపయోగించినట్టు ఇప్పటికే దర్శకుడు వెల్లడించారు.
ఇక దర్శకుడు చెప్పినట్టే టీజర్ లో భారీ గ్రాఫిక్స్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో వచ్చి మంచి విజయం సాధించిన క్రిష్ సినిమా రేంజ్ లో హనుమాన్ విజువల్స్ కనిపిస్తున్నాయి. హనుమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ కల్కి, అ, జాంబి రెడ్డి లాంటి డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జాంబి రెడ్డి సినిమాను ప్రశాంత్ వర్మ తేజ సజ్జ హీరోగా తెరకెక్కించగా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా తరవాత మొదట హనుమాన్ ను అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ హీరోగా తేజ సజ్జను ప్రకటించాడు.