అమ్మతనమే కాదు విలనిజం కూడా పండించిన నిర్మలమ్మ
అలాంటి నిర్మలమ్మ గురించి కొన్ని కబుర్లు ఆమె కుమార్తె ద్వారా తెలుసుకుందాం.. 1927 నవంబర్ నెల దీపావళి వెళ్ళిన ఏడో రోజున సప్తమి తిథి నాడు తొమ్మిదో సంతానంగా బందరు లో పుట్టింది అమ్మ. తాతయ్య కోటయ్య, అమ్మమ్మ గంగమ్మ లు అమ్మ ను పెంచి పెద్ద చేశారు. మూడో తరగతి వరకే చదువుకున్న అమ్మ చిన్నప్పటి నుంచే ఆటపాటలలో చాలా చలాకీగా ఉండేదట. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నాటకాలంటే ప్రాణం అని చెప్పేది. వేదాంతం రాఘవయ్య గారి తో కలిసి డ్యాన్స్ చేసిందట అమ్మ.. ఏడు సంవత్సరాల వయసులో మార్కండేయ సినిమాలో చిత్రపురి నారాయణమూర్తి గారి ద్వారా నాటకాలలో నటించడానికి అవకాశం వచ్చింది.
అమ్మకు 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి వివాహం చేసుకోమని అమ్మమ్మ అడిగిందట. అందుకు అమ్మ నన్ను కళాకారిణిగా ప్రోత్సహించే వారినే చేసుకుంటాను అని నిక్కచ్చిగా చెప్పిందట. కళల పట్ల ఆసక్తి ఉన్న కృష్ణ రావు గారితో అమ్మ వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటి నుంచి ఇద్దరిదీ ఒకే మాట ఒకే బాట. ఏ పోటీ కి వెళ్ళిన అమ్మకు బహుమతి తప్పనిసరి. ఆంధ్ర కళా పరిషత్తులో మూడుసార్లు వరుసగా బహుమతులు రావడంతో నిర్వాహకులు అమ్మ ఇక నుంచి బహుమతులకు దూరంగా ఉండండి అన్నారట. అమ్మగా, బామ్మ గా ఎన్నో పాత్రల్లో అలరించిన అమ్మ కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ గా కూడా ఓ సినిమాలో కనిపించి విలనిజం పండించారు. స్వాతిముత్యం సినిమాలో అమ్మ పోయిన సీన్ చూస్తుంటే ఇప్పటికి ఏడుపు వస్తుంది అని భావోద్వేగానికి లోనయ్యింది కవిత.