ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నా అనంత్ శ్రీరామ్..!
ఇక అనంత్ లోని సాహిత్యశోభను చూసి కీరవాణికి ముచ్చటేసింది. తాను స్వరకల్పన చేసే చిత్రాలలో అనంత్ ను ప్రోత్సహించారాయన. మరికొందరు సంగీత దర్శకులు, యువదర్శకులు కూడా తమ చిత్రాల్లోని సందర్భాలు వివరించగానే అనంత్ నోట పలికిన మాటలు విని ఆశ్చర్య పోయి, ఆ మాటలతోనే పాటలు రాయించుకున్నారు.
అయితే తన దరికి చేరిన ఏ సినిమాకైనా న్యాయం చేయాలని తపించేవాడు అనంత్ శ్రీరామ్. ఈ తపనలో అనేక చిత్రాలలో సింగిల్ కార్డ్ కూడా వేయించుకున్నాడు. 'ఎటో వెళ్ళి పోయింది మనసు'తో ఉత్తమ గీతరచయితగా నంది అవార్డును, ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు అనంత్. ఇతనిలోని సాహిత్యాభిలాషను గమనించిన ఎందరో అనంత్ కు మిత్రులుగా మారారు.
అంతేకాదు.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ రాసిన 'ఎ లవ్, అన్ కండిషనల్' రూపకల్పనలో అనంత్ శ్రీరామ్ పాత్ర కూడా ఉంది. ఇలా ఓ వైపు పాటలు రాస్తూనే, మరోవైపు తన దరికి చేరిన సాహితీగంధానికి తన పదాలతో మరింత సువాసన పెంచే ప్రయత్నం చేస్తుంటాడు అనంత్ శ్రీరామ్.
ఇక ఓ నాటి ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య అనంత్ కు పెదనాన్న వరుస. ఆయన ప్రోత్సాహంతోనే అనంత్ చిత్రసీమలో అడుగు పెట్టారు. అయితే, ఇక్కడ మాత్రం తన స్వయంప్రతిభతోనే అనంత్ రాణిస్తున్నాడు. కేవలం పాటలు రాయడంలోనే కాదు కొన్ని చిత్రాలలో అనంత్ నటించాడు కూడా. ఏది ఏమైనా, అనంత్ శ్రీరామ్ పాటలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. మరిన్ని మంచి పాటలతో అనంత్ జనాన్ని మరింతగా ఆకట్టు కుంటారని ఆశిద్దాం.