పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉపాధి.. కొత్త ఉద్యోగాలకి కేటీఆర్ పచ్చ జెండా..!

Suma Kallamadi

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళతర విధానాలు ఆకట్టుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగల సంస్థలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొస్తున్నాయని. గుజరాత్‌ తర్వాత ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. షాబాద్‌లో 3,600 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజక వర్గంలోని షాబాద్‌ మండలం చందనవళ్లి గ్రామంలో వెల్‌స్పన్‌ పరిశ్రమలో ఫ్లోరింగ్‌ టైల్స్‌ విభాగాన్ని  కేటీఆర్‌ ప్రారంభించారు. టెక్స్‌టైల్‌ఉత్పత్తుల విభాగానికి భూమిపూజ చేశారు.

 

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘చందనవళ్లి పారిశ్రామిక వాడలో ప్రారంభమైన మొదటి పరిశ్రమ వెల్‌స్పన్‌దే. వెల్‌స్పన్‌ సంస్థ అధినేత బాల్‌కిషన్‌ గోయెంకా గుజరాత్‌కు చెందిన వారైనా ఇక్కడి విధానాలతో సంతృప్తి చెంది పరిశ్రమలు పెట్టడం శుభపరిణామం. ఈ కంపెనీ రూ. 2వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ యూనిట్‌ భారతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలను పూర్తిగా తీర్చనుంది. దీని ద్వారా చందనవళ్లి పేరు సిలికాన్‌వ్యాలీలో కూడా వినిపిస్తుంది. వింబుల్డన్‌లో వాడే టవళ్లు ఇక్కడి నుంచి ఉత్పత్తి కానున్నాయి.

 


ఇది ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమే. చందనవళ్లి పారిశ్రామిక సమూహంలోకి నాలుగు సంస్థలు రాబోతున్నాయి. మరో నాలుగు కంపెనీలు ఇక్కడ స్థలాన్ని కోరుతున్నాయి. భవిష్యత్‌లో మరో 40 నుంచి 50 కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు సహకరిస్తే 3600 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తాం. దీనికి అవసరమైన మౌలిక వసతులు, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. శంషాబాద్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.220 కోట్లు ఇస్తాం. ఇక్కడ 220కె.వి. సబ్‌స్టేషన్‌ను కూడా మంజూరు చేస్తాం. రూ.50కోట్లతో హైదరాబాద్‌- నాగర్‌గూడ రోడ్డు చేపడతాం.. పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తాం.. చందనవళ్లి యువతకు కోసం ఇక్కడే నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.’’ అని కేటీఆర్‌ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: