ఓ నిర్ణయానికొచ్చేసిన పుష్ప చిత్రయూనిట్...!
కరోనా అన్ని దేశాలను.. అన్ని వ్యాపారాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమను దెబ్బమీద దెబ్బకొడుతోంది. కరోనా క్రైసిస్ లో బడ్జెట్ తగ్గుతుందని అందరూ భావిస్తుంటే.. పెరగడం నిర్మాతలను కలవరపెడుతోంది.
లాక్ డౌన్ పెట్టి దాదాపు మూడు నెలలు అవుతున్నా.. సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు తేరుకోలేదు. టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఊపందుకున్నా.. సినిమా షూటింగ్స్ మొదలైంది ఒకటీ అర మాత్రమే. నటీనటులు.. టెక్నీషియన్స్ అందుబాటులో ఉన్నా.. బన్నీనటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయలేకపోతున్నారు. కథంతా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరగడంతో.. పుష్ప షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి.
పుష్పకోసం ఎర్రచందనం స్మగ్లింగ్ ను కథా వస్తువుగా ఎంచుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, లెక్కల మాష్టారు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమా షూటింగ్ ను కేరళ అడవుల్లో తీయాల్సి ఉంది. కరోనా ఎఫెక్ట్ తో అక్కడకు వెళ్లి తీయలేని పరిస్థితి. ఆంధ్రాలోని అడవుల్లోనే తీయాలని.. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లిని షూటింగ్ స్పాట్ గా ఎంచుకున్నారు. అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అక్కడకు వెళ్లి రిస్క్ చేయడం ఎందుకని.. ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకుంది చిత్ర యూనిట్. బడ్జెట్ ఎక్కువైనా.. సెట్ వేసి తీయడమే సేఫ్ అనే ఆలోచనకు చిత్ర బృందం వచ్చింది.
కరోనా భయపెడుతున్న సమయంలో బయటకు వెళ్లి షూటింగ్ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో పుష్ప కోసం అన్నపూర్ణ ఏడు ఎకరాల స్థలంలో ఫారెస్ట్ సెట్ వేసి షూటింగ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారనీ.. ఆల్ రెడీ ఆ పనులు మొదలు పెట్టారని తెలిసింది. గతంలో చాలా సినిమాల ఫారెస్ట్ సీన్స్ ను ఇక్కడే చిత్రీకరించారు. అన్నమయ్యలో అలివేలు మంగ ప్రత్యక్షమై.. అన్నమయ్యకు లడ్డు ఇచ్చే సన్నివేశాన్ని.. శ్రీరామదాసులోని పర్ణశాల సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.