స్టూడియోల ధరలకు రెక్కలొచ్చాయ్.. !
తెలంగాణలో స్టూడియోలకు గిరాకీ పెరుగుతోంది. నిబంధనలు పాటిస్తూ పలు సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్ మొదలయింది. ప్రభుత్వం అనుమతివ్వటంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల సినిమాలు, సీరియల్స్ పట్టాలెక్కుతున్నాయి.
కరోనా వచ్చింది. లాక్ డౌన్ తెచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని బంద్ అయ్యాయి. ఈ మధ్యే ప్రభుత్వాలు సడలింపులు ఇస్తుండటంతో..అన్ని వ్యవస్థలు తిరిగి ట్రాక్ పైకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ..సినిమా, సిరియల్స్ షూటింగ్స్ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో షూటింగులు పట్టాలెక్కుతున్నాయి.
కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చిలో షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. దాదాపు మూడు నెలల నుండి సినిమాలు, సీరియల్స్ కార్యకలాపాలు ఆగిపోయాయి. వీటిలో సెట్స్ పై ఉన్న సినిమాలు అనేకం ఉన్నాయి. అటు సీరియల్స్ కూడా కొత్త ఎపిసోడ్ ల షూటింగుల్లేక పాత ఎపిసోడ్ లు వేయటం లేదా తాత్కాలికంగా విరామం తీసుకోవటం జరుగుతోంది. ఇప్పుడు సడలింపుల తర్వాత అనుమతులు రావటంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటోంది.
అయితే కరోనా పరిస్థితుల మధ్య షూటింగుల తీరు ఒక్కసారిగా మారిపోయింది. స్టూడియోలో మొదలై, అవుట్ డోర్ చేరిన షూటింగులు ఇప్పుడు మళ్లీ స్టూడియోలకు చేరుకున్నాయి.
కొన్నేళ్లుగా ఎంత చిన్న సినిమా అయినా.. అవుడ్డోర్ కోసం, ఫారెన్ వైపు పరిగెడుతోంది. దాంతో స్టూడియోలన్నీ.. దాదాపు మూత పడే స్థాయి కి చేరుకున్నాయి. కానీ కరోనా దెబ్బకు సీన్ మారుతోంది. మళ్లీ సినిమాలు, సీరియల్స్ స్టూడియోలవైపే చూస్తున్నాయి. దీంతో స్టూడియోలే పెద్ద దిక్కుగా మారబోతున్నాయి. అయితే, పరిమితమైన సిబ్బంది మధ్య షూటింగ్ జరుపుకోవాలనే నిబంధనలున్నాయి.
హైదరాబాద్ లో స్టూడియోలోని ఫ్లోర్లన్నీ బుక్కయిపోయాయి. ఆర్.ఆర్.ఆర్, వకీల్ సాబ్, ఆచార్య, ప్రభాస్ సినిమా ఇవన్నీ ఇప్పుడు సెట్స్ లోనే జరగబోతున్నాయి. క్రిష్- పవన్ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ వేయబోతున్నారు. దాదాపు 40 శాతం ఆ సెట్లోనే షూటింగ్ జరగబోతోంది. వీటన్నిటికి తోడు సీరియల్స్ హడావుడి ఉండనే ఉంది. దీంతో కేవలం టీవీ షోలకే పరిమితమైపోయిన సారధి స్టూడియోల్లాంటివి సైతం ఇప్పుడు కొత్త ఉత్సాహం తెచ్చుకుంటున్నాయి.