అల్లు అర్జున్ నటుడు కాకపోయి ఉంటే ఏం చేసేవారో తెలుసా...?
వరుస విజయాలతో టాలీవుడ్ లో సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్ తన స్టైల్ తో, డ్యాన్సులతో, నటనతో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నటుడు కాకపోయి ఉంటే ఏం చేసేవారనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చారు. యాంకర్ "నటుడు కావాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది...? ఒకవేళ నటుడు కాకపోతే ఏమయ్యేవారు...? " అనే ప్రశ్నకు బన్నీ తాను బాల్యంలో నటుడు కావాలని అస్సలు అనుకోలేదని చెప్పారు.
బాల్యం నుండి హీరో అయ్యేవరకు కెరీర్ విషయంలో ఒకే ఆలోచనతో ఎప్పుడూ లేనని ఒక్కో సందర్భంలో ఒక్కోలా అవ్వాలని అనుకునేవాడినని చెప్పారు. కొన్నిసార్లు మార్షల్ ఆర్ట్స్ టీచర్ అవ్వాలనుకున్నానని, కొన్నిసార్లు పియానో టీచర్ అవ్వాలనుకున్నానని మరికొన్ని సందర్భాలలో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కావాలనుకున్నానని చెప్పారు. కొన్ని సందర్భాలలో నాసాలోపని చేయాలని కూడా అనుకున్నానని ఆ తరువాత మనస్సు మారిందని అల్లు అర్జున్ చెప్పారు.
18 - 19 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి నటుడు కావాలని ఫిక్స్ అయ్యానని అనుకున్న విధంగానే నటుడయ్యానని అల్లు అర్జున్ యాంకర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 సినిమాల తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.