"100 % లవ్" తో ప్రేమ.. పెళ్లి.. నందు-గీతా మాధురిల ప్రేమ కథ

Suma Kallamadi

ఫిబ్రవరి 14 "వాలెంటీన్స్ డే" రోజు సందర్భంగా ఓ సెలబ్రిటీ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.. ఆ సెలబ్రిటీ జోడి ఎవరు అనుకుంటున్నారా..??  ఒకరు తన గాత్రంతో అన్ని రకాల పాటలు పాడగలరు. మరొకరు తన అచ్తింగ్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు. వారే యాక్టర్ నందు- సింగర్ గీతా మాధురి. అసలు వారి ప్రేమ ఎలా మొదలైంది? వీరు ఒకరినొకరు ఇష్టపడటానికి గల కారణాలేంటి? వీరి ప్రేమ .. పెళ్లికి ఎలా దారితీసింది? వంటి ప్రశ్నలకి సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 

వీరిద్దరి మొదట పరిచయం ఒక సాంగ్ రికార్డింగ్ స్టూడియోలో జరిగింది. నందు హీరోగా ఒక సినిమా ప్రారంభోత్సవం జరగ్గా.. ఆ చిత్ర పాటల రికార్డింగ్ సమయంలో కలుసుకున్నారు. అయితే అది కేవలం ముఖ పరిచయమే. అయితే కర్నూల్‌ కి వరదలు వచ్చిన సమయంలో తెలుగు చిత్రపరిశ్రమ.. ఆ ప్రాంతానికి అండగా నిలబడింది. నిధులను సేకరించడం కోసం ఓ కార్యక్రమం కూడా చేసింది. ఇదే కార్యక్రమంలో గీతా మాధురి, నందులు మళ్లీ కలిసారట. ఆ తర్వాతే వారిద్దరూ.. మంచి స్నేహితులుగా మారారట. 

 

అయితే వీరి ప్రేమకి కారణం మాత్రం.. ఇద్దరికీ జీవితం పట్ల ఉన్న భావసారూప్యత అనే చెబుతారు. ఎందుకంటే చిత్రపరిశ్రమలో అవకాశాలు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. విషయంలో మాత్రం ఈ జంటకి పక్కా క్లారిటీ ఉండేదట. బహుశా ఈ క్లారిటీనే వీరిరువురిని.. ఇలా ముందుకి సాగేలా చేసిందని అంటుంటారు వీరి సన్నిహితులు. "100% లవ్" చిత్రంలో సెకండ్ హీరో పాత్రలో నటించాడు నందు. ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి గీతామాధురి కూడా హాజరైందట. ఆ ఫంక్షన్‌ లోనే వారి స్నేహం మరింత పెరిగిందని చెబుతుంటారు. నందు తనకు నచ్చడానికి ప్రధాన కారణం..  అతని కళ్ళు అని అంటుంది గీత. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై.. ఇరు కుటుంబాలకి ముందుగా ఎటువంటి సమాచారం కూడా లేదట.

 

ఒకరోజు ఉన్నటుండి.. వీరి ప్రేమకు సంబంధించి ఓ వెబ్ సైట్ వార్తని ప్రచురించడం జరిగింది. ఈ వార్త బయటకి రావడంతో.. ఇరు కుటుంబాలు ఈ విషయమై ఇద్దరినీ ఆరా తీశారట. అప్పటికే ఇరువురు జీవితాన్ని కలిసి పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి.. తమకి ఒకరంటే మరొకరికి ఉన్న ఇష్టాన్ని తమ పెద్దలకి తెలియచేశారు. ఇక అప్పటికే పాపులర్ సింగర్‌గా గీత మాధురి గురించి నందు ఇంట్లో తెలియడంతో పాటు.. గీతకి మంచి స్నేహితుడిగా వాళ్ళ ఇంట్లో నందుకి కూడా మంచి పేరుండడం ఈ జంటకి బాగా కలిసొచ్చింది.

 

అయితే వీరిద్దరూ ఇంకొద్ది సమయం తీసుకుని పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. పెద్దలు మాత్రం ప్రేమ వ్యవహారం బయటకి తెలిసాక ఎక్కువగా ఆలస్యం చేయడం మంచిది కాదని అనుకున్నారట. అందుకే ఇద్దరికీ వెంటనే వివాహం జరిపించారు. ఇక వీరి వివాహం.. 9 ఫిబ్రవరి 2014 తేదిన జరిగింది. ఈ ఇద్దరి వివాహానికి చిత్రపరిశ్రమ నుండి ఎందరో తరలి వచ్చారు. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి ప్రముఖులెందరో వచ్చి వీరిని ఆశీర్వదించడం జరిగింది.

 

ప్రస్తుతం వీరు తమ అయిదేళ్ల వివాహ బంధంలో.. ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా సాగిపోతున్నారు. వీరి ప్రేమకి గుర్తుగా ఆగష్టు 9 2019న ఈ జంటకి ఒక చంటి పాపాయి జన్మించింది. ఇక ఆనందంగా వారి జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: