తమిళ స్టార్ హీరో తల అజిత్ నటిస్తున్న 60వ చిత్రం వలిమై షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ గా నటించనున్నాడని గత రెండు రోజులనుండి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కార్తికేయ , నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ పాత్రలో నటించడంతో తాజాగా మరో సారి ప్రతినాయకుడి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడని టాక్ వచ్చింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.
వలిమై మేకర్స్ విలన్ గా వేరే వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. అసలు వారు కార్తికేయ ను సంప్రదించలేదని సమాచారం. దాంతో కార్తికేయ విలన్ గా నటించనున్నాడని వచ్చిన వార్తలకు చెక్ చెప్పినట్లే అయ్యింది. ఇక ఈ చిత్రంలో యామి గౌతమ్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా యువ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. కాగా వీరి నలుగురి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో పింక్ రీమేక్ తెరకెక్కగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమా కన్నా ముందు ఈఏడాది సంక్రాంతి కి విశ్వాసం తో ప్రేక్షకులముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు అజిత్. ఇక ఇప్పుడు ఈ వలిమై పై కూడా భారీ అంచనాలు వున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.