వెంకీ మామ: ఫ్యామిలీ - కామెడీ ల్లో వెంకీని మించినోడు లేడంతేనంటున్న విక్టరీ ఫ్యాన్స్ !
విక్టరీ వెంకటేష్, నవ యువసామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్ మరోసారి తన మార్కు కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్యామిలీ కామెడీ సినిమాలతో ఇప్పటికే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడని చెప్పలేం కానీ ఒక మోస్తరు విజయాన్ని మాత్రం అందుకున్నాడని చెప్పవచ్చు.
ఫ్యామిలీ కామెడీ సినిమాలతో కలిసుందాంరా, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎఫ్ 2 సినిమాలతో హిట్లు అందుకున్న వెంకటేష్ వెంకీ మామ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఫ్యామిలీ కామెడీ సినిమాల్లో వెంకటేష్ కు తిరుగులేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ మామ సినిమాకు వెంకటేష్ కామెడీ మెయిన్ హైలెట్ గా నిలిచింది.
58 సంవత్సరాల వయస్సులో కూడా వెంకటేష్ ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా నటించాడు. కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్ వెంకీ మామ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. క్లైమాక్స్ లో వెంకటేష్, నాగచైతన్య మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు.
దర్శకుడు బాబీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం సినిమాకు కొంత మైనస్ గా మారింది. ఈ వారాంతంలో ఫ్యామిలీతో సినిమా చూడాలనుకునేవారికి వెంకీమామ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. సినిమాకు థమన్ ఇచ్చిన పాటలు నేపథ్య సంగీతం బాగున్నాయి. రాశీఖన్నా, పాయల్ సినిమాలో పాత్రల పరిధి మేర నటించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.