ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇక లేరు

NAGARJUNA NAKKA

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇకలేరు.  కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వేణుమాధవ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. వేణు అకాల మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.


కామెడీ యాక్టర్ వేణుమాధవ్ మృతి చెందారు.  కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్‌కు కిడ్నీ సమస్య కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఇటీవల సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి  విషమించడంతో.. తుది శ్వాస విడిచారు. 


వేణుమాధవ్ ఆరోగ్యంపై గతంలో చాలా రూమర్లు వచ్చాయి. ఆయన చనిపోయారంటూ కూడా ప్రచారం చేశారు. ఈ వార్తలపై వేణుమాధవ్ చాలా సార్లు స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి నిజంగానే విషమించడం.. చికిత్స పొందుతూ మరణించడంతో అభిమానులు, ఇండస్ట్రీ పెద్దలు షాక్ అయ్యారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.  


1979 డిసెంబర్ 30న కోదాడలో జన్మించిన వేణుమాధవ్...సినీ రంగంలోకి రాకముందు తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లో పనిచేస్తూనే మిమిక్రీ ఆర్టిస్టుగా కొనసాగారు. 1996లో వచ్చిన 'సంప్రదాయం' సినిమా ద్వారా నటుడిగా పరిచయమ్యారు. 'మాస్టర్', 'తొలిప్రేమ', 'సుస్వాగతం', 'తమ్ముడు' సినిమాలతో హాస్యనటుడిగా పాపులర్ అయ్యారు.  


దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. హీరోగానూ వెండితెరపై వేణు మాధవ్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించారు. అలాగే పలు టెలివిజన్ సీరియల్స్‌లో హోస్ట్‌గా వ్యవహరించారు. 


కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వేణుమాధవ్ రాజకీయాల్లోకి వచ్చారు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఆ తరవాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వస్థలమైన కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినా ఎన్నికల అధికారి దాన్ని తిరస్కరించారు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. 
టైమింగ్ ఉన్న మంచి నటుడు, సహచరుడ్ని కోల్పోయామని తెలుగు సినిమా హాస్య నట కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుంటున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: