టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో మర్చిపోలేని సినిమా శివ. తెలుగు సినిమా చరిత్రను చెప్పాలంటే బాహుబలికి ముందు వరకు శివకు ముందు... శివ తర్వాత అని చెప్పేవారు. ఈ సినిమాతో ఎంతో మంది చరిత్ర మారిపోయింది. రాంగోపాల్‌వర్మ, నాగార్జున, అమల, కృష్ణవంశీ, తేజ, ఉత్తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. వీరిలో సీనియర్ నటుడు జేడీ.చక్రవర్తి కూడా ఒకరు.
తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న జేడీ చక్రవర్తి శివ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని చెప్పారు. ఆ సినిమాలో ఇరానీ కేఫ్ లో జేడీకి, నాగార్జునతో ఓ ఫైట్ ప్లాన్ చేశాడట దర్శకుడు వర్మ. అప్పటికే ఈ విషయం లీక్ కావడంతో చాలా మంది షూటింగ్ చూడడానికి అక్కడకు వచ్చేశారట.
మధ్యాహ్నం టైంలో జేడీ బయటకు వెళుతుండగా... ఎదురుగా వచ్చిన నాగార్జునకు జేడీ భుజం తగిలిందట. నాగార్జున ఎటు చూసి నడుస్తున్నావ్... కనీసం సారి చెప్పాలని తెలియదా ? అనడంతో జేడీ సార్ .. మీరు మర్యాదగా మాట్లాడండని కాస్త ఓవర్ చేశాడట. వెంటనే నాగ్ జేడీని లాగిపెట్టి కొట్టగా కిందపడ్డాడట.
కిందపడ్డ జేడీ వెంటనే లేచీ నాగ్ కాలర్ పట్టుకోవడం.. నాగ్ మనుషులు జేడీని కొట్టడానికి వస్తుండగా... నాగ్ వాళ్లను ఆపి ఇది షూటింగ్ అని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారట. అప్పుడు వెంటనే అక్కడ పెద్ద గందరగోళం నెలకొందని... ఏం జరిగిందో కూడా ఎవ్వరికి అర్థం కాలేదని జేడీ చెప్పారు. సీన్ రియల్గా ఉండాలనే వర్మ ఇలా ప్లాన్ చేశాడట.