నటుడు రావు రమేష్ కి మాతృవియోగం..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో 80,90వ దశకంలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పారు రావు గోపాల రావు.  ముత్యాల ముగ్గు చిత్రంలో ఆయన కొట్టిన డైలాగ్..'ఎప్పుడూ యదవ బిగినెస్సేనా.. మడిసన్నాక కుసంత కలా పోసనుండాల.. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?', 'సెగట్రీ సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఆకాసంలో ఏదో మర్డర్‌ జరిగినట్లు లేదూ' అంటూ రావుగోపాల్‌ రావు చెప్పిన డైలాగులు బాగా పేలాయి. దీంతో రావుగోపాల్‌రావు కంచు కంఠానికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది.

తెరపై ఆయన వాయిస్‌ వినిపించిందంటే ప్రేక్షకులు థియేటర్‌లో ఊగిపోయేవారంటే అతిశయోక్తి లేదు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడీయన్‌గా.. నెగటివ్‌, పాజిటివ్‌ ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి నటవిరాట్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచారు. నటనలో ఒక ట్రెండ్‌ సెట్‌ చేసి 'లారీ డ్రైవర్‌', 'భార్గవ రాముడు', 'వింత దొంగలు' వంటి తదితర చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకాదరణ పొందారు. 

రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వ కాలంలో 1984 నుంచి 85 వరకు ఎంఎల్‌సీగా పనిచేశారు. 1986 నుంచి 92 వరకు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు.  ప్రస్తుతం ఆయన తనయుడు రావు రమేష్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.  తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ..విలన్, కమెడియన్, తండ్రి, మామ పాత్రలు పోషిస్తున్నారు. 

తాజాగా విలక్షణ విలన్ రావు గోపాల్ రావు సతీమణి, నటుడు రావు రమేష్ తల్లి కమలా కుమారి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాసను విడిచారు.  కమలా కుమారి కూడా కళారంగంలోనే ఉంటూ వచ్చారు.స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన కమలా కుమారికి.. రావు గోపాల్ రావు కూడా ఓ నాటకంలో పరిచయం అయ్యారు.

ఆ తరువాత ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. రావు గోపాల్ రావు మరణం తరువాత కూడా ఆమె ఎన్నో నాటకాలలో నటించారు. రావుగోపాలరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: