అల్లు అర్జున్ అభిమానులు అతడిని స్టైలిష్ స్టార్ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. అయితే ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ పత్రిక అల్లుఅర్జున్ ఫోటోను ఆపత్రిక కవర్ పేజీ పై ప్రచురించడమే కాకుండా బన్నీని మిలీనియమ్ స్టార్ అంటూ పతాక శీర్షికలో ప్రకటించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.
సాధారణంగా ఇంగ్లీష్ పత్రికలు తమ కవర్ పేజీలలో టాలీవుడ్ స్టార్స్ ఫోటోలను ముఖ చిత్రాలుగా వేయరు. అయితే గతంలో చిరంజీవి మహేష్ ల ఫోటోలతో కొన్ని ఇంగ్లీష్ పత్రికలు వార్తా కథనాలు వ్రాసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా జాతీయ మీడియాకు పెద్దగా పరిచయం లేని అల్లు అర్జున్ ను హైలెట్ చేస్తూ ముంబాయ్ నుండి ప్రచురితం అయ్యే ‘ఒపీనియన్ ఎక్స్ ప్రెస్’ ఇంగ్లీష్ పత్రిక అల్లు అర్జున్ ఫోటోతో ఆసక్తికర కథనాన్ని లేటెస్ట్ గా ప్రచురించింది.
బన్నీ గొప్పతనాన్ని వివరిస్తూ త్వరలో దక్షిణాది సినిమా రంగానికి మిలీనియమ్ స్టార్ గా అల్లు అర్జున్ మారబోతున్నాడు అంటూ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది ఆపత్రిక. వాస్తవానికి ఈపత్రిక సినిమా పత్రిక కాదు. రాజకీయ విషయాల గురించి ఆసక్తికర కథనాలు ప్రచురించే పత్రిక ఇది. ఇలాంటి రాజకీయ పత్రిక అల్లు అర్జున్ ను హైలెట్ చేస్తూ ఎందుకు కవర్ స్టోరీ వ్రాసింది అంటూ చాలామంది టాలీవుడ్ ప్రముఖులు కూడ ఆశ్చర్య పోతున్నట్లు టాక్.
తెలుస్తున్న సమాచారం మేరకు అల్లుఅర్జున్ ప్రభాస్ మాదిరిగా నేషనల్ స్టార్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో బన్నీ గొప్పతనాన్ని బాలీవుడ్ కు తెలిసి వచ్చేలా ఈ పత్రిక ద్వారా ఆసక్తికర కథనం ప్రచురింప చేయడంలో అల్లు కాంపౌండ్ హస్తం ఉంది అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. ఏది ఏమైనా బన్నీకి మిలీనియమ్ స్టార్ అనే కొత్త ట్యాగ్ వచ్చింది కాబట్టి రానున్న బన్నీ సినిమాల టైటిల్ కార్డ్స్ లో స్టైలిష్ స్టార్ బదులు మిలీనియమ్ స్టార్ బిరుదుతో అల్లు అర్జున్ పేరు కనిపిస్తుంది అనుకోవాలి..