షాకింగ్ 2 కోట్లకు 50 కోట్లు వసూళ్లు !

Seetha Sailaja

ఇండస్ట్రీలో తలలు పండినవారు కూడ విడుదలకు ముందు ఏసినిమా హిట్ ఏసినిమా ఫ్లాప్ అవుతుంది అన్న అంచనాలు వేయలేదు. ఆ సీక్రెట్ తెలిస్తే అందరూ సక్సస్ సినిమాలనే తీస్తారు. ఈమధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు ఎవరూ ఊహించని అనూహ్య విజయాలను సాధిస్తున్నాయి. తెలుగు సినిమాలకు సంబంధించి కొంతకాలం క్రితం విడుదలైన ‘జాతిరత్నాలు’ ‘డిజే టిల్లు’ ఎలాంటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే.
 
 
ఇప్పుడు అలాంటి ఒక చిన్న సినిమా మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. నెలరోజుల క్రితం మళయాళంలో విడుదలైన ‘రోమంచమ్’ మూవీ సృష్టిస్తున్న రికార్డులు దక్షిణాది సినిమా రంగంలో షాకింగ్ గా మారాయి. ఈమూవీలో పేరున్న హీరో ఎవరు నటించలేదు. బట్టతలతో పొట్టిగా ఉండే షాహిర్ అనే నటుడు ఈమూవీలో నటించాడు.
 
 
ఈమూవీ కేవలం 2 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఇప్పటివరకు 55 కోట్ల కలక్షన్స్ ను రాబట్టిందని వార్తలు వస్తున్నాయి. జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ కం హారర్ థ్రిల్లర్. ఈమూవీ కథ 2007 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతోందనే ఉద్దేశంతో సరదాగా ‘ఔజా’ గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఏమిటంటే ఒక బోర్డు మీద ఇంగ్లీష్ అక్షరాలు నెంబర్లు ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడ్డం. ఏదో సరదా కోసం మొదలుపెట్టిన ఈ గేమ్ ఎవరూ ఊహించని ట్విస్ట్ లు తీసుకుని ప్రేక్షకులను ఆసినిమా చూస్తున్నంత సేపు తరువాత రాబోయే సీన్ ఏమిటి అన్న ఆలోచనల వైపు తీసుకువెడుతుంది.
 
 
ఇప్పుడు ఈమూవీ సూపర్ సక్సస్ కావడంతో ఈమూవీని రీమేక్ చేయడానికి మన తెలుగు ఇండస్ట్రీ నుండి అనేకమంది ప్రయత్నిస్తున్నప్పటికీ ఈమూవీ నిర్మాతలు చెపుతున్న రేటుకు భయపడి చాలామంది వెనకడుగు వేస్తున్నారు అన్న మాటలు కూడ ఉన్నాయి. క్రియేటివిటీ ఉంటే చాలు ప్రేక్షకులు పెద్ద సినిమా చిన్న సినిమా అన్నది చూడటంలేదు అన్న విషయానికి ఒక ఉదాహరణ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: