చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా భేటీ..కీలక చర్చలు...?

murali krishna
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన, మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ ఫీవర్ ను పెంచాయి.ఇటు ఏపీలో అమరావతి రైతుల పాదయాత్ర, అటు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. విపక్షాలు అమరావతికి మద్దతు తెలుపుతుండగా…వైసీపీ మాత్రం పాలనా వికేంద్రీకరణ పేరిట స్పీడు పెంచింది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు మద్దతుగా వైసీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా బాట పడుతున్నారు. మరోవైపు చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ అంటూ కథనాలు వస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉన్నానే కానీ..నా నుంచి రాజకీయాలు దూరం కాలేదన్న సినిమా డైలాగుతో చిరు రీ ఎంట్రీ ఖాయమన్న సంకేతాలిచ్చారు. అంతటితో ఆగకుండా తన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భవిష్యత్ లో తన తమ్ముడికి మద్దతిస్తానేమోనని ఒక ప్రశ్నకు ముక్తసరిగా సమాధానం చెప్పారు. దీంతో జనసేనలోకి చిరంజీవి అడుగుపెడతారన్న టాక్ నడిచింది.సహజంగా ఇది మెగా అభిమానులకు, జనసైనికులు సంతోషకరమైన వార్తే. వారు సంబరాలు కూడా చేసుకున్నారు.అయితే చిరు ప్రకటన కొందరు నాయకులకు ఊపిరినిచ్చింది. ఏపీలో అధికార, విపక్ష పార్టీలో చాలామంది నాయకులు కంఫర్టుగా లేరు. అధికార పార్టీలో ఉన్నవారు పవర్ చేతిలో ఉన్నా పనులు చేయలేకపోతున్నామని అసంతృప్తి ఉంది. అటు ప్రధాన ప్రతిపక్షంలోఉన్నవారు పార్టీ అధికారంలోకి వస్తుందా? రాదా? అన్న అభద్రతా భావంతో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. అదే సమయంలో జనసేన గ్రాఫ్ పెరుగుతుందని.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు, సీట్లు గణనీయంగా పెంచుకుంటుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి.సరిగ్గా ఇటువంటి సమయంలోనే చిరు ప్రకటన ఆకట్టుకుంది. చిరంజీవి కానీ పొలిటికల్ గా యాక్టివ్ అయి జనసేనకు మద్దతిస్తే.. నాయకుల చేరిక భారీగా ఉండడం ఖాయం.సరిగ్గా ఇటువంటి సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవిని కలడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో చర్చలు జరపడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. గత మూడేళ్లుగా గంటా శ్రీనివాసరావు టీడీపీకి అంటీముట్టనట్టుగా ఉన్నారు. నచ్చినప్పుడు కండువా వేసి మాట్లాడుతున్నారు. నచ్చనప్పుడు కనిపించకుండా పోతున్నారు. కానీ టీడీపీలోనే ఉంటానని చెప్పుకొస్తున్నారు. అటువంటి వ్యక్తి చిరంజీవిని కలవడం రాజకీయాల్లో ఓకింత ఆసక్తిగా మారింది. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ అయినందున అభినందించడానికి గంటా కలిశారని చెప్పుకొస్తున్నా.. వారి మధ్య రాజకీయ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి కట్టే చాన్స్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో చిరంజీవి జనసేనలో చేరితే మంచి స్థానముంటుందని గంటా సలహా ఇచ్చినట్టు సమాచారం. చిరంజీవితో గంటాకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవికి గంటా అండదండగా నిలిచారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి, రాష్ట్ర కేబినెట్ లో గంటాకు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. ఆ చనువుతోనే చిరంజీవిని కలిసిరాజకీయ రీఎంట్రీకి ఇదే కరక్ట్ సమయమని గంటా చెప్పినట్టు సమాచారం. మొత్తానికైతే ఏపీలో చిరంజీవి రాజకీయ పునరాగమనంపై పెద్ద చర్చలే నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: