ప్రతి సినిమా రిలీజ్ కి హీరోలు, దర్శకులు జగన్ ని కలవాల్సిందేనా..?

Deekshitha Reddy
ఇటీవల రాధేశ్యామ్ విడుదలకు ముందు హీరో ప్రభాస్, ఏపీ సీఎం జగన్ ని కలిశారు. ఆ సందర్భంలో చిరంజీవి టీమ్ అంతా ఉండటంతో అదేమంత పెద్ద విషయం కాలేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సీఎం జగన్ ని కలిశారు. సరిగ్గా సినిమా విడుదలకు ముందు ఈ భేటీ జరగడం విశేషంగా మారింది. అంటే పెద్ద సినిమాల విడుదలక ముందు హీరోలు, దర్శక నిర్మాతలంతా సీఎంని కలవాల్సిందేనా..?
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా విడుదల ఇప్పటికి ఖరారైంది. కరోనా వల్ల పలు వాయిదాలు పడ్డా.. చివరకు ఈసారి మాత్రం కచ్చితంగా బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమయ్యారు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి ఇటీవలే ఫుల్ స్టాప్ పెట్టింది. కొత్త జీవోను విడుదల చేసింది.  అయితే ఈ జీవో ప్రకారం ఆర్ఆర్ఆర్ కి లాభం ఏ స్థాయిలో ఉంటుందనేది ప్రశ్నార్థకం. దీనిపై మరోసారి సీఎం జగన్ ని కలసి ఆర్ఆర్ఆర్ కి వెసులుబాట్లు ఇవ్వాలని దర్శకుడు రాజమౌళి కోరినట్టు సమాచారం.
సీఎం జగన్ తో భేటీ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్‌ సినిమా కావడంతో.. సినిమా విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ ని కలిశామని, ఆ సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం తమకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సీఎం తమతో చాలా బాగా మాట్లాడారని, సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు రాజమౌళి.
ఈనెల 25న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ బడ్జెట్ 450 కోట్ల రూపాయలని టాక్. ఆ బడ్జెట్ రికవరీ కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిందే. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే కలెక్షన్లే ఆధారం. తెలంగాణలో పరిస్థితి బాగానే ఉంది కానీ, ఏపీలో మాత్రం పెంచిన టికెట్ రేట్లు సరిపోవనే భావన సినిమా వాళ్లలో ఉంది. దీంతో మరోసారి దర్శక నిర్మాతలు సీఎం జగన్ ని కలిశారు. బెనిఫిట్ షో ల విషయంలో రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: