తెలుగు లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలని చూసినా..అదృష్టం కలిసి వచ్చి ‘ఉయ్యాల జంపాల’సినిమాతో హీరోగా మారాడు రాజ్ తరుణ్. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకుడిగా పనిచేసిన రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ హిట్ కావడంతో మనోడికి బాగా కలిసి వచ్చింది. తర్వాత నటించిన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో రాజ్ తరుణ్ మినిమం గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నాడు.
తాజాగా రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో 'లవర్' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ జోడీగా రిద్ధి కుమార్ కనిపించనుంది. ఈ సినిమాలోని ఐదు పాటలను ఐదుగురు సంగీత దర్శకులతో చేయించడం విశేషం. నిన్ననే ఈ సినిమా నుంచి టైటిల్ లోగో పోస్టర్ ను వదిలారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రాజ్ తరుణ్ వెరైటీ హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు కామెడీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇచ్చిన రాజ్ తరుణ్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపిస్తున్నట్లుంది. ఓ కొండ చివర కూర్చుని హీరో ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ వుంది.
సాయికార్తీక్ అందించిన మ్యూజిక్ బిట్ తో కలిపి అందించిన ఈ మోషన్ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేదిలానే వుంది. దిల్ రాజుకి యూత్ పల్స్ తెలుసుకనుక, వాళ్ల నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.