హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూసపాటి కోటలో కొలగట్లకు కష్టమేనా?

ఏపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో పూసపాటి అశోక్ గజపతి రాజు కూడా ఒకరు. 1978 నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టిన అశోక్‌కు...విజయనగరం అసెంబ్లీ పెద్ద కంచుకోట. 1978 నుంచి విజయనగరంలో మరో నాయకుడుకు విజయం దక్కిన సందర్భాలు చాలా అరుదు. 1978లో జనతా పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్....1983, 1985, 1989, 1994, 1999, 2009 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లోనే అశోక్‌కు ఒక్కసారి ఓటమి ఎదురైంది.
ఇక 2014లో అశోక్ విజయనగరం ఎంపీగా గెలిస్తే, విజయనగరం అసెంబ్లీలో టీడీపీ తరుపున మీసాల గీత గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ దెబ్బ అశోక్ ఫ్యామిలీ మీద బాగా పడింది. అశోక్...విజయనగరం ఎంపీగా ఓడిపోగా, ఆయన కుమార్తె అతిథి విజయనగరం అసెంబ్లీలో ఓటమి పాలయ్యారు. వైసీపీ తరుపున కొలగట్ల వీరభద్రస్వామి గెలిచారు. 2004లో కూడా ఈయనే అశోక్‌ని ఓడించింది. ఇలా రెండోసారి పూసపాటి కోటలో గెలిచిన కొలగట్ల, తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు.
విజయనగరంలో ప్రభుత్వం తరుపున జరిగే అన్నీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి.  అయితే ఎమ్మెల్యేగా కొలగట్ల పూర్తి దూకుడుని కనబర్చడం లేదని తెలుస్తోంది. అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలని పరిష్కరించడంలో కొలగట్ల వెనుకబడి ఉన్నారని సమాచారం. విజయనగరం చుట్టూ ఎన్ని నదులు ప్రవహిస్తున్నా, విజయనగరం కార్పొరేషన్‌లో తాగునీటికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.
అలాగే ఇరుకైన రహదారులు, డ్రైనేజ్ సమస్యలతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్‌లో వైసీపీ గెలిచినా సరే, సరైన అభివృద్ధి మాత్రం జరగడం లేదు. అటు రూరల్‌లో అభివృద్ధి శూన్యం. ఇక రాజకీయంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం...ఏ స్థాయిలో అశోక్‌కు చెక్ పెట్టాలని అనుకుంటుందో తెలిసిందే. అశోక్‌పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని విజయనగరం ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఇదే వైసీపీకి నెగిటివ్ అవుతుంది. అటు అశోక్ కుమార్తె అతిథి కూడా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి నియోజకవర్గంలో టీడీపీ కూడా బలపడినట్లు కనబడుతోంది. ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పూసపాటి కోటలో కొలగట్లకు గెలుపు కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: