హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యే తిరుపతిలో మెజారిటీ పెంచుతారా?
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం...వైసీపీకి కంచుకోట. గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే గెలుపు. ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వరప్రసాద రావు దాదాపు 45 వేల మెజారిటీతో గెలిచారు. అయితే కేవలం జగన్ ఇమేజ్ వల్లే గూడూరులో వైసీపీకి ఇంత భారీ మెజారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ మెజారిటీ వల్లే తిరుపతి పార్లమెంట్లో వైసీపీకి మరింత భారీ మెజారిటీ రావడానికి కారణమైంది.
అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఇప్పుడు కూడా గూడూరులో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇంకా జగన్ ఇమేజ్ చూసి ఓట్లు వేస్తే వైసీపీకి మంచి మెజారిటీ వస్తుంది. లేదంటే ఎమ్మెల్యే పనితీరు మీద ఆధారపడి ఓట్లు వేస్తే ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు ఇంకా జగన్ ఇమేజ్ శ్రీరామరక్షగా ఉందని తెలుస్తోంది.
ఈ ఏడాదిన్నర సమయంలో ఎమ్మెల్యే ప్రజల మన్ననలు పొందడం తక్కువే అంటున్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉన్న సందర్భాలు లేవు అంటున్నారు. కాకపోతే కొత్తగా సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక ఇక్కడి ప్రజలు జగన్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీకు ప్లస్ అవుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి.
దీనికో తోడు తిరుపతి ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకునే జగన్ గూడూరు అభివృద్ధి కోసం అనేక నిధులని కేటాయించారు. అయితే నియోజకవర్గంలో దందాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీని వల్ల పార్టీకు చెడ్డపెరు వస్తుందని, ప్రజల్లో వ్యతిరేకిత పెరుగుతుందని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. అలాగే వైసీపీలో వర్గపోరు కూడా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓడిపోయాక సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేత సునీల్ కుమార్...ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే తిరుపతి పార్లమెట్లో టీడీపీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులని బట్టి చూస్తే వైసీపీకి మునుపటి మెజారిటీ రావడం కష్టమని తెలుస్తోంది. మరి చూడాలి గూడూరు నుంచి వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుందో?