హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నంద్యాలలో శిల్పా హవా నడుస్తుందా?

కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం...శిల్పా ఫ్యామిలీకి కలిసొచ్చిన నియోజకవర్గం...ఇక్కడ నుంచి శిల్పా మోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి ఎంట్రీ ఇచ్చాక, కాస్త శిల్పాకు కష్టకాలం మొదలైంది. 2014 ఎన్నికల్లో భూమా వైసీపీ నుంచి పోటీ చేస్తే శిల్పా టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భూమా స్వల్ప మెజారిటీ తేడాతో శిల్పాపై గెలిచారు.
అయితే భూమా తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. ఇక ఆ తర్వాత కొంతకాలానికి భూమా అనారోగ్యంతో మరణించారు. దీంతో నంద్యాల ఉపఎన్నికల్లో చంద్రబాబు టిక్కెట్ భూమా ఫ్యామిలీకి చెందిన బ్రహ్మానందరెడ్డికి ఇచ్చారు. దీంతో శిల్పా టీడీపీని వీడి వైసీపీలో వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి శిల్పా పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు రవి చంద్ర కిషోర్ రెడ్డికి వైసీపీ టిక్కెట్ వచ్చేలా చేసుకున్నారు.
అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డిపై రవి భారీ మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రవి, నియోజకవర్గంలో ఆకట్టుకునే విధంగా పనులు చేస్తున్నారు. మళ్ళీ నంద్యాలలో శిల్పా ఫ్యామిలీ హవా నడిచేలా చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్లు నిర్మాణాలు చేస్తున్నారు.
అయితే నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన అవసరముంది. అలాగే పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి కూడా పరిష్కారమయ్యేలా చేస్తే రవికి తిరుగుండదు. అలాగే అందుకు తగ్గట్టుగా నిధులు అందితే రవికి అడ్వాంటేజ్ అవుతుంది. బ్రహ్మానంద రెడ్డి ఓడిపోయిన నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే భూమా అఖిలప్రియ తన సొంత తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి నంద్యాలలో పెత్తనం ఇవ్వాలని చూస్తున్నారని టాక్. ఈ క్రమంలోనే బ్రహ్మానందరెడ్డికి అఖిలనే చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల నంద్యాలలో టీడీపీ ఇంకా పుంజుకోలేకపోతుంది. మొత్తానికైతే నంద్యాలలో శిల్పా ఫ్యామిలీ హవా మొదలైనట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: