హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దూసుకెళుతున్న అబ్బయ్య...సైలెంట్ అయిన చింతమనేని..
ఈయన దూకుడుగా ఉండటం, తహశీల్దార్ వనజాక్షితో గొడవ, అలాగే ఆర్టీసీ డ్రైవర్ని కొట్టడం, అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే చింతమనేని చాలానే రచ్చ చేశారు. ఇదే సమయంలో ఆయన నియోజకవర్గ ప్రజలకు బాగానే అండగా నిలిచారు. కానీ వివాదాలు హైలైట్ కావడంతో 2019 ఎన్నికల్లో చింతమనేని చిత్తుగా ఓడిపోయారు. వైసీపీ నుంచి కొఠారు అబ్బయ్య చౌదరీ విజయం సాధించారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అబ్బయ్య నియోజకవర్గంలో దూసుకెళుతున్నారు. మార్నింగ్ వాక్ పేరుతో ప్రజలని కలుస్తూ, వారి సమస్యలని పరిష్కరిస్తున్నారు. పథకాల అమలులో ముందున్నారు. అటు దెందులూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. బలమైన టీడీపీ కేడర్ని తనవైపు తిప్పుకుంటున్నారు. రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. 300 కోట్లతో కొల్లేరులో రెగ్యులేటర్ ఏర్పాటు చేయనున్నారు. అటు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఫామాయిల్ రైతులకు అండగా ఉంటూ, వారికి గిట్టుబాటు ధర దక్కేలా కృషి చేస్తున్నారు.
ఇటు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. కార్యకర్తలని కూడా దూకుడుగా ఉండొద్దని చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు చూపించడం లేదు. ఎక్కడ ఏది చేస్తే వివాదం అయ్యి కేసులు వస్తాయనే భయంతో చింతమనేని సైలెంట్ అయ్యారు. కరోనా సమయంలో కూడా ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరిగి ప్రజలకు అండగా ఉంటే, చింతమనేని మాత్రం కార్యకర్తల వరకే పరిమితమయ్యారు. మొత్తానికైతే దెందులూరులో అబ్బయ్య దూసుకెళుతుంటే, చింతమనేని సైలెంట్ అయ్యారు.