హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: భవానికి భర్త సపోర్ట్ బాగా ఉందా..బుచ్చయ్యతో విభేదాలు తగ్గాయా?
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే...అది ఆదిరెడ్డి భవాని. చంద్రబాబు తర్వాత టీడీపీలో మంచి మెజారిటీ వచ్చింది భవానికే. రాజమండ్రి సిటీ స్థానం నుంచి దాదాపు 30 వేలపైనే మెజారిటీతో గెలిచారు. ఇక భవాని ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని లేదు. భవాని దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె అని అందరికి తెలిసిందే. ఇటు భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గురించి కూడా తెలిసిందే.
అయితే ఇక ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండటంతో భవాని, జగన్ గాలిలో కూడా భారీ మెజారిటీతో గెలవగలిగింది.ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, రాజకీయాలకు కొత్త కావడం వల్ల భవానికి తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ బాగా అండగా ఉంటున్నారు. నియోజకవర్గంలో ఏ పనైనా శ్రీనివాస్ చూసుకుంటున్నారు. అలాగే భర్తతో కలిసి ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తనకు సాధ్యమైన వరకు పనులు చేస్తున్నారు.
ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తనదైన శైలిలో సమస్యలపై గళం విప్పిన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తడబడకుండా స్పీచ్ ఇవ్వగలుగుతున్నారు. అలాగే చంద్రబాబు ఏదైనా పోరాటాలకు పిలుపునిస్తే అందులో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో భవాని ట్రస్ట్ పేరిట పేదలకు సాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. తన భర్త శ్రీనివాస్ నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తున్నారు.
అయితే ఆదిరెడ్డి ఫ్యామిలీకి, టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అంతకముందు సిటీ నుంచి 4 సార్లు బుచ్చయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014 లో బీజేపీతో పొత్తు వలన బుచ్చయ్య రూరల్ కు మారారు. అయితే బుచ్చయ్య 2019 లో సిటీ నుంచి పోటీ చేయాలనుకున్న, చంద్రబాబు, ఆదిరెడ్డి భవానికి టికెట్ ఇచ్చారు. దీంతో బుచ్చయ్య మళ్ళీ రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు.
కానీ సిటీలో మాత్రం బుచ్చయ్య వర్గం పెత్తనం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పైగా సిటీలోని సమస్యలని ఆదిరెడ్డి ఫ్యామిలీ పట్టించుకోవడం లేదని బుచ్చయ్య వర్గం ఆరోపిస్తుంది. ఇప్పటికీ ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. కాకపోతే చంద్రబాబు సర్దిచెప్పడంతో విభేదాలు పెద్దగా బయటపడటం లేదు.
ఇక విభేదాలు పక్కనపెడితే, రాజమండ్రి కార్పొరేషన్లో టీడీపీ బలంగా ఉంది. కాకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజమండ్రి కార్పొరేషన్ జరగడం లేదు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నిక వాయిదా వేశారు. మొత్తం మీద చూసుకుంటే భవాని భర్త సపోర్ట్ తో నియోజకవర్గంలో బాగానే పని చేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తనదైన శైలిలో సమస్యలు పరిష్కారం చేస్తున్నారు.