హ్యాపీ సండే : క్యాలెండర్ చెప్పే కథ ఏంటంటే?
దేహ కాంతి లో కాలం కరిగిపోయిన రోజు ఒకటి ఉంటుంది
దేహాల అప్పగింతల్లో కాలం విలువ అయి ఉంటుంది
విలువే లేనివి కొన్ని అప్పగింతల్లో కొట్టాడుతుంటాయి
కన్నీటికో విలువ రాతకో విలువ ఆ రెండింటి మధ్య
ఒక జీవిత కాల సందిగ్ధత ఎన్నో కూడుకుని ఉంటే
ఆ విలువను అమూల్యం అయిన కాలం మళ్లీ మళ్లీ
తిరిగి అందిస్తే మేలు.. కనుక దుఃఖం మనోగతం ఆత్మగతం
సంబంధిత చర్యలన్నీ కాల గతిలో కొట్టుకుని పోయి
జీవితానికి ప్రసాదించే ఏకాంతమే ఈ 12 పేజీల 12 నెలల కాలం
చేసే మంచికి సంకేతం సంబంధిత ప్రాభవానికి సంకేతం
కాలవాహినిలో లేదా ప్రవాహ కూడికల్లో వెళ్లిపోతున్న లేదా కరిగిపోతున్న అంకెల కాగితాలే ఈ క్యాలెండర్లు.. వచ్చినప్పుడు వెళ్లినప్పుడూ జీవితానికి చూపించే రంగులతేడానే ఈ 12 నెలల జీవితం.. 12 నెలల కాలం ఒక ఏడాదిని నిర్వచిస్తుందా లేదా ముందరి కాలం ప్రభావం వాటి అనుగుణ చర్యలు అన్నవి కూడా కలుపుకుని ఈ కాలాన్ని మనం నిర్ణయించి సంయుగ్మ ధోరణిలో ఉంటున్నామా అని ఓ రచయిత ప్రశ్నిస్తాడు.. ఆ విధంగా ప్రశ్నించడంలో కాలంకు చేసే విన్నపం కానీ కాలం నుంచి నేర్చుకున్నంత వినూత్నత ను కానీ మనం అతి దగ్గరగా పరిశీలించి ఏం నేర్చుకున్నాం అన్నది ఒక అవలోకన కావాలి.. వెళ్లిపోతున్న 12 కాగితాలూ కొన్నంటే కొన్ని విలువలకు ఆపాదితాలు.. అముద్రిత విలువల చెంత ముద్రిత అంకెలు కొన్ని క్యాలెండర్ కూ, మనకూ మనోగత చర్యలను ఉద్బోధిస్తాయా?
2021 కు వీడ్కోలు అని చెప్పడంలో సులువు ఉంది. బాధ్యత ఉంది. బంధగతం అయిన విషయం ఉంది.విశ్వాసం కూడా ఉంది. మనిషి తన మేల్కొల్పు తానే వెతుక్కోవాలి. మనిషి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే క్రమాన కొత్త విశ్వాసాలకు ప్రాతిపదిక ఏంటన్నది తప్పక చెప్పగలగాలి. మనిషి తన నుంచి తాను దూరం అయి కాలానికి చేసే ఏ విన్నపం కూడా నెగ్గుకు రాదు. అదే ఇవాళ్టి పరమ సత్యం. అవును మతం మనిషి అన్నవి విశ్వాసం నుంచి ఆపాదితం అయిన లేదా ప్రతిపాదితం అయిన దృగ్విషయా లు.. దృగ్గోచరాలు కూడా! కాలం వెళ్లిపోయి మన తప్పిదాలను పునఃశ్చరణ చేసుకోమని చెబుతుంది. అదే ధర్మం.. ధర్మాన్ని క్రమం తప్పక అనునయించడం మనిషికి ఉండాల్సిన తక్షణ కర్తవ్యం. ఈ జీవిత బోధలో తప్పిపోయిన వాళ్లంతా దేవుడికి ఇష్టం అని అంటారేంటో కొందరు! ఇది కూడా చదువరి జ్ఞాపకమే!