కృష్ణాష్ఠమి : వెండితెరపై...కృష్ణలీలలు...

సాధారణంగా నటీనటులు వాళ్ళ వాళ్ళ పాత్రలలో ఇమిడిపోవడాన్ని బట్టే ప్రేక్షకులు వారిని ఆరాధిస్తూ ఉంటారు. పలానా నటుడు వేసిన వేషం, ఆయన అభినయం ప్రేక్షకులను ఎంతగా కట్టి పడేసిందంటే వాళ్ళందరూ ఆయనకు వీరాభిమానులు అయిపోతారు. ఇది కొందరికి వారి జీవితకాలంలో వేసిన పాత్రల మూలంగా దక్కవచ్చు మరికొందరికి ఒక్క చిత్రంతో దక్కుతుంది. అంతలా ఆ పాత్ర చూపరుల మదిలో ముద్రవేసుకుపోతుంది. వెండితెరపై ఇలాంటి ప్రాముఖ్యతను పొందిన వారు అనేకమంది ఉన్నారు. అయితే వారందరూ ఏదో ఒక పాత్రలో నప్పుతారు అనేది ఆయా అభిమానుల చెదరని విశ్వాసం. పౌరాణిక పాత్రలలో దశావతారాల ప్రాముఖ్యతే వేరు. ఇందులో ఏ అవతారానికి ఎవరు అంటే ఒక్కో పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే అందులో వాళ్ళు అంత చక్కగా ఇమిడిపోయారు. తద్వారా ప్రేక్షకుల మన్ననలు కూడా పొందారు.
ఇక కృష్ణ పాత్ర విషయానికి వస్తే ఆనాటి మహానటుడు మొదలుకొని నేటి యువ నటుల వరకు ఎవరు వేసినా భలే నప్పిందే అనిపిస్తుంది, అది ఆ అవతార మహిమ కాబోలు. ఇక పౌరాణిక సినిమాల కాలంలో అయితే, అప్పటి నటులు ఎవరు ఈ పాత్ర ధరించినా ఆ రోజు వెండి తెరకు కర్పూర హారతి జరగాల్సిందే, అంతలా అలరించేవారు. అప్పటిలో అంత సాంకేతిక పరిజ్ఞానం లేకున్నా పౌరాణికాలు చిత్రీకరణలో ఆయా చిత్ర యూనిట్ చేసిన పనితనం వెండి తెరకు అంతటి అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. కాస్త ముందుకొస్తే, అంటే నటకిరీటి కాలానికి వస్తే పౌరాణికాలు అంతగా కనపడవు కానీ కృష్ణ వేషధారణ మాత్రం కనువిందు చేస్తూనే ఉంది. ఈ తరం వాళ్ళు కూడా ఈ పాత్రలో ప్రేక్షకుల మన్ననలు పొందారనే చెప్పాలి. ఈ తరం నుండి కృష్ణ పాత్ర కాస్త హాస్యాన్ని పంచింది. ఇంకొంచం ముందుకు వస్తే, వెండితెరపై ప్రదర్శించే చిత్రాలలో కూడా నాటకాలు వేస్తుండటం చూస్తుంటాం, అందులో కూడా కృష్ణ పాత్రలే ప్రదానం.
ఆనాటి పౌరాణికాలలో కృష్ణ మాయ, ఆ తరువాత కాలంలో కృష్ణుని హాస్య చాతుర్యం, ఇటీవల వేషధారణలు ఇది కృష్ణ పాత్రలలో మార్పులు. ఏ తరం ఈ పాత్ర పోషించినా దానికి తగిన విధంగా ఒదిగిపోవటం ఆయా నటుల గొప్పతనమో లేక ఆయన అవతార మహిమో మరి. ఎంత చేసినా చివరికి గోపీలోలుడు, చోరుడు అనే బిరుదులు ఇస్తున్నా ఆ చిరునవ్వు తరగదు. మాయలోడు కదూ ఏదో ఒక మాయ చేసి అందరిని మెప్పిస్తూనే ఉంటాడు. అది వెండితెర అయినా సరే, జీవితం అయినా సరే. చివరికి ఈ మాయలోడే మహాభారతం ద్వారా జీవితం లో సమస్యల అన్నిటికి పరిష్కారం కూడా చెప్పాడని ధర్మబోధకులు చెప్తుంటారు. అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్ఠమి శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: