మాస్కులను కడిగి మళ్లీ వాడొచ్చా.. ఖచ్చితంగా తెలుసుకోండి!!
కరోనా.. గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక వైరస్ కంటికి కనిపించకుండానే ప్రపంచదేశాలు కమ్మేసింది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం దక్కడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 1.50 లక్షలు మించిపోయింది. అటు మరణాల సంఖ్య సైతం ఆరు లక్షలు మించిపోయింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం వంటివి తప్పనిసరి అయిపోయింది.
ముఖ్యంగా మాస్కులను ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతరులకు కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మాస్క్‌లు తప్పనిసరి కావడంతో రకారకాలు మోడల్స్‌లో మాస్కులను తయారు చేస్తున్నారు. మరి మాస్కులను కడిగి మళ్లీ వాడొచ్చా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే గుడ్డ మాస్కులు ఆరు గంటలకొకటి మారుస్తూ ఉతికి వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇటీవల చాలా మంది కరోనా వైరస్ సోకకుండా రక్షణ కోసం ఎన్-95 మాస్కులను ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు.
సాధారణ మాస్కు కంటే దీని ధర 10 రెట్లకు పైగా అధికంగా ఉన్నప్పటికీ దీనికే మొగ్గు చూపుతున్నారు. ఇంతలోనే ఈ ఎన్95 మాస్కులు, క్లిప్స్ ఉన్న మాస్కులు వాడకూడదని.. వాటి వల్ల కరోనా వ్యాపిస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అన్నది పక్కన పెడితే.. ఇలాంటి మాస్కులను కడిగి వాడకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే వీటిని వాడేవారు ఐదు మాస్కులను సిద్ధం చేసుకొని ఒక్కో మాస్క్ ఒక్కో రోజు ధరించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అలా ఐదు రోజులు ఐదు మాస్కులు ధరించాక మొదటి రోజు వేసుకున్న మాస్క్ ను మళ్లీ పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇలా ఒక్కో మాస్కుని ఐదు సార్లు వాడి ఆ తర్వాత పడేయడం మంచిదని సూచిస్తున్నారు.