విజయం మీదే: ఏకాగ్రతతో పరీక్ష రాస్తే విజయం మీ సొంతం
మరికొన్ని రోజుల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పరీక్షలనగానే విద్యార్థుల్లో టెన్షన్, భయం మొదలవుతుంది. పరీక్షలు ఎలా రాయాలో, ఎన్ని మార్కులు వస్తాయో, ప్రశ్నాపత్రం ఎంత కఠినంగా వస్తుందో ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు విద్యార్థులను కంగారు పెడతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలన్నా, అనవసర భయాందోళనకు గురి కాకూడదన్నా ఏకాగ్రతే ప్రధాన ఆధారం.
ఏకాగ్రత చేపట్టిన పనిలో నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించేలా చేస్తుంది. ఏకాగ్రతను అలవరచుకొని పనిపై శ్రద్ధ పెడితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం. అనవసరపు మాటలు, పనికిరాని వ్యాపకాలు, ఘర్షణలు మనస్సును ముంచితే ఏకాగ్రతకు ఆటంకం కలుగుతుంది. విద్యార్థులు ఏకాగ్రతను అలవరచుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
రోజులో కొంత సమయం పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ఏకాగ్రతను పెంచుకుంటే కూర్చుని ఎంతసేపైనా పని చేసే లక్షణం మనలో పెరుగుతుంది. విద్యార్థులు ఎప్పుడూ పరీక్ష రాసే వారి సంఖ్యను, వారి సన్నద్ధ సరళిని పట్టించుకోకూడదు. ఏకాగ్రత దెబ్బ తీసే అంశాల గురించి ఆలోచించకూడదు. ఏకాగ్రతతో చదివితే పరీక్షలలో మంచి ఫలితాలను పొందటంతో పాటు జీవితంలో చేపట్టిన ఏ పనిలోనైనా విజయం చేకూరుతుంది.