కిషన్‌ రెడ్డి ఎఫెక్ట్‌: మేడారం జాతరకు కేంద్రం నజరానా..?

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతరకు కేంద్రం చేయూత అందిస్తోంది. భారత ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతరకు 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులను విడుదల చేసేందుకు అంగీకరించింది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గిరిజన పండుగలలో ఒకటని..  ఈ పండుగకు ప్రభుత్వం అన్ని విధాలా వీలైన సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి  జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్‌ల అభివృద్ధిలో మేడారాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

2016-17 లోనే దాదాపు 80 కోట్ల రూపాయలతో ములుగు - లక్నవరం - మేడవరం - తాడ్వాయి - దామరవి - మల్లూర్ - బోగత జలపాతాలలో కేంద్రం సమగ్ర అభివృద్ధిని చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. మేడారంలో అతిథి గృహాన్ని, ఓపెన్ ఆడిటోరియం, పర్యాటకుల కోసం విడిది గృహాలు, త్రాగునీరు వంటి వివిధ సౌకర్యాలు,  సోలార్ లైట్లు వంటి వాటిని ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. 2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే వివిధ పండుగల కోసం రు. 2.45 కోట్లను మంజూరు చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో సుమారు 85 తిరుగుబాట్లలో పాల్గొన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తింపునిచ్చేందుకు దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియంలను నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో నిర్మిస్తున్న రామ్ జి గోండ్ గిరిజన మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు మ్యూజియం కూడా ఉన్నాయని తెలిపారు.

ఈ రెండు మ్యూజియంలకు ఒక్కొక్క దానికి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  వివరించారు. ప్రముఖ ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా, కొమరం భీమ్, రామ్‌జీ గోండ్, అల్లూరి సీతారామరాజు వంటి వారి పోరాటాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: