బుడుగు : మీ పిల్లలకు మీరు ఎప్పుడన్నా కధలు చెప్పారా.. !!

Suma Kallamadi
మీ పిల్లలకు మీరు ఎప్పుడన్నా కధ చెప్పారా.. !! చాలా మంది పేరెంట్స్ దగ్గర నుండి వచ్చే సమాధానం లేదు అనే..  ఇప్పటి ఆధునిక కాలంలో కధలా.. !! అంటే ఏంటి అని అంటారు తల్లితండ్రులు.. పిల్లలకు కథలు చెప్పే ఓపిక, తీరిక మాకు ఎక్కడ ఉంది. పిల్లలకు ఫోన్ ఇస్తే అందులోనే చూస్తారు కదా అని అనేవారు లేకపోలేదు.. ఎంత అయిన అప్పటి కాలం వేరు.ఎందుకంటే అప్పట్లో ఎంచక్కా ఆరుబయట మంచం వేసుకుని పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కదా చెప్పేవారు. కధ వింటూ హాయిగా నిద్రలోకి జారుకునేవారు. మరి ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళు, ఎంతసేపు ఫోన్, లేడంటే టీవీ, వీడియో గేమ్స్ అదే ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు కధలు గురించి ఎందుకు అంటారా.. !! కారణము ఉంది అండి. అసలు పిల్లల్లో  ఊహాశక్తి అనేది పెరగడానికి కారణం కధలే..

అనగనగా..అనగనగా అని చెప్పడం మొదలు కాగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి  అడుగు పెడతారు. కథలో ఉన్న పాత్ర ల్లో తమను తాము చూసుకుంటారు. దృశ్యాన్ని చూసే అనుభూతి కలుగుతుంది. కానీ ఆలోచించే అవసరం పెద్దగా ఉండదు. కానీ కథ చెప్పడం, చదవడం, వినడం వల్ల పిల్లల ఊహ జగత్తు కు అంతమనేదే ఉండదు. సృజనాత్మక భావన బాగా పెరుగుతుంది.కథ వింటూ ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? మరి అయ్యో ఇప్పుడెలా అమ్మ.. అని ప్రశ్నలు అడుగుతారు . దీంతో వారి ఆలోచనలకు పరిధి చాల పెద్దదవుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను తేలికగా పరిష్కరించే శక్తి అలవాటవుతుంది. అన్నిటికీ మించి కొత్త,కొత్త పదాలను పరిచయం చేస్తూ భాషా గొప్పదనం తెలిసేలా కథలు బాగా ఉపయోగ పడతాయి.

మన చిన్నతనంలో తల్లితండ్రులు , నానమ్మ,అమ్మమ్మ, తాతమ్మ, తాతయ్యలు మనకి  పురాణ కథలు,నీతికథలు, జానపదకథలు, హాస్యకథలు, పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తుంటే మయమరిచి వినేవాళ్ళం. దాని వల్ల మనకు ఎంతో కొంత లోకజ్ఞానం తో పాటు ఎన్నో విషయాలు నేర్చుకున్నే అవకాశం కలిగిందనే చెప్పాలి. మరీ.. ఇప్పటి తరం పిల్లల పరిస్థితి ఏంటి ?వారికి ఇలాంటి కథలు చెప్పే సమయం మనకు లేక పోగా కనీసం ఇంటిలో పెద్దవారు కూడా లేకపోవడం దురదృష్టం అనే చెప్పాలి.కధ గొప్పతనం గురించి తదుపరి వ్యాసంలో తెలుసుకుందాం... !!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: