మన దేశంలో చీతాలు ఎలా అంతరించిపోయాయి?

Purushottham Vinay
మనం ఇప్పుడు సాధారణంగా కుక్కలను ఎలా పెంచుకుంటున్నామో ఇక అప్పట్లో అడవుల్లో నుంచి తీసుకొచ్చి చీతాలను చూసుకునేవారు. జింకలు, దుప్పులను వేటాడేందుకు వెళ్లినప్పుడు ఈ చీతాలను ఉపయోగించేవాళ్లు. ఇందుకోసం వేటకు వెళ్లేముందు ఆ చీతాల కళ్లకు గంతలు కట్టి ఎడ్లబండిపై అడవులకు తీసుకెళ్లేవారు. జింకలు, దుప్పులు ఉన్న ప్రాంతాల్లో కళ్లగంతలు విప్పి వాటిని వదిలేసేవారు. అప్పుడు చీతాలు చాలా వేగంగా పరుగెత్తుకెళ్లి జింకలు, దుప్పులను పట్టుకునేవి. అప్పుడు వాటి యజమానులు వెళ్లి జింకలు, దుప్పులను చంపి వాటి మాంసం తెచ్చుకునేవారు. అందులో కొంత మాంసాన్ని జీతాలకు పెట్టేవారు. ఈ విషయం మీకు నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది వాస్తవం. 1939లో వైల్డర్‌నెస్ ఫిలింస్ ఇండియా లిమిటెడ్ తీసిన ఫొటోలు, వీడియోల్లో ఇవన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి కూడా. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.చీతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అనవసరంగా ఎవరిపైనా దాడి చేయవు. ఇవి రెండు నుంచి ఐదు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి. దాదాపు 15 కిలోల మాంసం వీటికి సరిపోతుంది.


మళ్లీ ఆకలి అయినప్పుడు మాత్రమే మాంసం కోసం వేటాడుతాయి. అది కూడా ఒక మోస్తరు పరిమాణంలో ఉండే జింకలు, దుప్పులు, అడవి పందులు వంటి జంతువులనే ఇవి వేటాడేందుకు ఇష్టపడతాయి.అప్పట్లో జింకలు, దుప్పులను వేటాడేందుకు చీతాలను తీసుకెళ్లేవారు. అయితే నాటి రాజులు, బ్రిటీషర్లు గొప్పలు చెప్పుకోవడం కోసం.. వాళ్ల సరదా కోసం చీతాలను కూడా వేటాడేవారు. పెంపుడు చీతాల సాయంతో హంటింగ్ పార్టీలను జరుపుకునేవారు. ఒక్క చీతాలనే కాదు.. పులులు, సింహాలు, చిరుత పులులు, అడవి ఏనుగులు ఇలా చాలా జంతువులను వేటాడి చంపేవారు. దీనివల్ల చీతాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా చీతాల పిల్లల్లో మరణాల రేటు కూడా అధికం. పుట్టిన వారాల్లోనే 90 శాతానికి పైగా మృత్యువాత పడుతుంటాయి. ఈ రెండు కారణాల వల్ల చీతాలు ఎక్కువ రోజులు మనుగడ సాధించలేకపోయాయి. దీంతో క్రమక్రమంగా భారత్‌లో చీతాలు అంతరించిపోయాయి. మన దేశంలో ఆసియన్ చీతాలు అంతరించిపోయాయని 1952లో అధికారికంగా ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: