సికింద్రాబాద్ లో ఒక బావి ఉందని చాలా మందికి తెలియదు. దీన్ని పంచీలాల్ పేట్ బావి అంటారు. ఈ బావిని 18 వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 1834 నాటి గుర్తులను కూడా ఇక్కడ అధికారులు గుర్తించారు. బ్రిటిష్ కాలంలో ఈ బావి చుట్టూ పిట్ట గోడ నిర్మాణం జరిగింది. ఈ బావి లోతు 53 అడుగులు. కానీ కాలక్రమేణా ఇందులో చెత్త పేరుకుపోవడంతో ఈ బావి మూసుకుపోయి ఓ చెత్తకుప్పలా మారిపోయింది. ఈ బావిని పునరుద్ధరించాలని నిర్ణయించిన తర్వాత దీనిలో నుంచి దాదాపు రెండు వేల టన్నుల చెత్త బయటకు తీశారంటే ఈ బావి దుస్థితి ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బావి నుంచి చెత్తను బయటకు తీయడానికి 70 నుంచి 100 మంది మహిళలు పనిచేశారు. పురుషులు ఈ పని చేస్తే వారు బలంగా ఏదైనా చేసినప్పుడు దీని నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బావిలో రోజు ఉదయానికల్లా ఐదారు అడుగుల నీరు ఊరుతుంది.
ఈ పురాతన కట్టడాన్ని పునరుద్ధరించడం, చారిత్రక కట్టడానికి పూర్వవైభవం తీసుకురావడం అంత సులభం కాదు అంటున్నారు నిపుణులు. దీని నిర్మాణంలో అవలంభించిన విధానాన్ని పరిశీలించడానికి సైంటిఫిక్ మ్యాపిక్ పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో వాడిన సున్నాన్ని టెస్టింగ్ చేయడంతోపాటు పాత చెట్ల వేర్లు ఈ కట్టడాన్ని ఏమైనా బలహీనంగా మార్చాయా అనే కోణంలో కూడా అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు. దీని మరమ్మత్తులకు ఇప్పటివరకు సుమారు 60 లక్షల వ్యయం చేశారు. ఇంకా దాదాపు కోటి 20 లక్షల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బావికి మళ్లీ పూర్వ కళ తీసుకొస్తే భూగర్భ జలాలు మాత్రమే కాదు వర్షపునీరు, వరద నీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. దీనిని ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.