పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పసుపు లేని వంట గది లేదు. ఈ పసుపు అనేది మన నిత్య అవసరాల్లో ఒకటి. ప్రతి ఇంటి వంట గదిలో ఖచ్చితంగా ఈ పసుపు అనేది ఉండాల్సిందే. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా వ్యాధులని మన దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది.మనల్ని ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది.అందుకే దీన్ని అందరు ఔషధాల గని అంటారు.అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే దీనిని పచ్చబంగారం అని అంటారు. ఇక ఈ పచ్చ బంగారం పండిస్తున్న రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎట్టకేలకు గిట్టుబాటు ధర పలకడంతో రైతు కళ్లల్లో ఆనందం అనేది కనిపించింది. నిజామాబాద్ మార్కెట్‌లో అయితే ఈ పసుపు ధర రికార్డులు సృష్టిస్తోంది.క్వింటా పసుపు ఏకంగా ధర 10 వేల మార్క్‌ను దాటింది. దీంతో కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకున్న రైతుల పంట బాగా పడుతోంది. అయితే ముందే పంటను అమ్ముకున్న రైతులు బాగా నిరాశ చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం లోని నిజమాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పంటకు ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి ధర అనేది లభించింది.గురువారం నాడు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు మధసూధన్ రెడ్డి మార్కెట్‌కు 38 క్వింటాల్ పసుపు పంటను తరలించడం జరిగింది. ఇక కమీషన్ ఏజెంటు హన్మంతరావు అండ్ కంపెనీ కొనుగోలు చేశారు.ఇదే రైతు తీసుకొచ్చిన పసుపు మండ రకానికి క్వింటాకు ఏకంగా రూ.9,211లుగా ధర పలికింది.అలాగే గత జనవరి నెలాఖరులో ప్రారంభమైన పసుపు కొనుగోళ్లు ఏప్రిల్ దాకా కొనసాగాయి. ఈ సీజన్‌లో కొమ్ము గరిష్ట ధర వచ్చేసి కేవలం రూ. 7,800 లోపే పలికింది.అయితే తాజాగా రూ. 10,116 ధర పలకడం మాత్రం నిజంగా పెద్ద విశేషం అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో ఉండే పసుపు సాగు ఈ సారి 32వేల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. దీని దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ధర పెరిగింది.