పిల్లల్లో ఒమిక్రాన్‌ డేంజర్‌.. ఆ జబ్బు వస్తోందట?

Chakravarthi Kalyan
ఒమిక్రాన్.. కొన్ని నెలల క్రితం.. ఈ వైరస్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచంలోనే అతి వేగంగా వ్యాపించే వైరస్‌ గా దీనికి పేరు వచ్చింది. అయితే.. రావడం వేగంగానే వచ్చినా.. దీని ప్రభావం చాలా నామామాత్రంగా ఉంది. కనీస లక్షణాలు కూడా లేకపోవడంతో చాలా మంది ఈ ఒమిక్రాన్‌ను చాలా లైట్‌ గా తీసుకున్నారు. అందుకే ఇది వచ్చినంత వేగంగా తోక ముడిచేసింది. ఇప్పుడు దేశంలో కరోనా భయాలు కనిపించడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అంతే.


అయితే.. కరోనా ఒమిక్రాన్‌ వచ్చిపోయిన వారిలో ప్రత్యేకించి పిల్లల్లో క్రూప్‌ అనే శ్వాసకోశ వ్యాధి వస్తున్నట్లు బోస్టర్ పరిశోధకులు గుర్తించారు. అక్కడి పిల్లల వైద్యశాల జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం గుర్తించారట. ఈ వ్యాధి బారినపడిన బాలలు బాగా దగ్గుతూ ఉంటారు. ఎంతగా అంటే ఒక్కోసారి ఊపిరాడక ఆ పిల్లలు బలంగా శ్వాస తీసుకోవలసిన పరిస్థితి వస్తుంటుంది. ఒమిక్రాన్‌ వైరస్‌ శ్వాస కోశంలో ఎగువ భాగానికి సోకుతుందని ఇప్పటికే జంతువులపై జరిగిన పరిశోధనల్లో తేలింది కదా.

ఈ ఒమిక్రాన్ బారిన పడిన పిల్లల్లోనూ ఈ క్రూప్ వ్యాధి వ‌చ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. చాలా మంది పిల్లలకు ఈ క్రూప్‌ కొవిడ్‌ 19తోనే వస్తోందట. అయితే ఊరట ఏంటంటే.. అలా క్రూప్ వచ్చిన  వారిలో ఏ ఒక్కరూ మరణించలేదట. కాకపోతే దీని తీవ్రత మాత్రం బాగానే ఉంటోంది. క్రూప్‌ వచ్చిన పిల్లల్లో 9 మంది ఆస్పత్రిలో చేరవలసి వస్తే.. వారిలో నలుగురు ఐసీయూలో చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చిందట.


ఇక నూటికి 97 శాతం మందికి డెక్సామిథేసోన్‌ మందుతో చికిత్స చేసి నయం చేశారట. ఈ క్రూప్ వ్యాధితో ఆస్పత్రి చేరికలు కూడా ఎక్కువగానే ఉన్నాయట. మిగిలిన కరోనా వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్‌ వైరస్ వేరియంట్ కారణంగా పిల్లల్లో ఈ క్రూప్ వచ్చే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉందట. అందుకే మీ పిల్లలకు ఇప్పటికే ఒమిక్రాన్ బారిన పడి ఉంటే.. వారి ఆరోగ్య పరిస్థితిని గమనించండి. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స అందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: