హెల్త్‌ వండర్ : ఢిల్లీకి కేసీఆర్.. హైదరాబాద్‌కు ప్రియాంక..?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌.. దేశంలో అతి ముఖ్యమైన ఆరు నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు తర్వాత స్థానం హైదరాబాద్‌దే.. ఐటీ విషయంలో దేశంలోనే సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటికీ అతి తక్కువ ఖర్చుతో సామాన్యుడు కూడా సాఫీగా జీవించే పరిస్థితి హైదరాబాద్‌లో ఉంది. విద్య, వైద్య, పారిశ్రామిక, సేవా రంగాల్లో హైదరాబాద్ తన ర్యాంకును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటోంది. ఇక వైద్య రంగంలో హైదరాబాద్‌కు దేశంలోనే మంచి పేరుంది. దేశంలోనే అత్యున్నత వైద్యం అందించగలిగే ఆసుపత్రులు హైదరాబాద్‌లో ఉన్నాయి.

ప్రభుత్వ రంగంలో నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు మంచి పేరుంటే.. ప్రైవేటులో కేర్, అపోలో, కిమ్స్, కామినేని, ఏఐజీ వంటి అత్యున్నత స్థాయి ఆస్పత్రులు ఉన్నాయి. ఇక ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దేశంలోనే మంచి పేరుంది. బసవతారం, ఎంఎన్‌జే వంటి క్యాన్సర్ ఆస్పత్రులూ హైదరాబాద్‌లో ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి కూడా కొందరు ప్రత్యేక వైద్యం కోసం హైదరాబాద్ వస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మనవడు, ప్రియాంకా గాంధీ కుమారుడికి కంటి చికిత్స కోసం ప్రియాంక హైదరాబాద్ రాబోతున్నారు.

ఢిల్లీలో ఎయిమ్స్ వంటి అత్యున్నత ఆస్పత్రులతో పాటు అనేక ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నా.. ప్రియాంక తన కుమారుడి చికిత్స కోసం హైదరాబాద్ వస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తనకు చికిత్స కోసం.. తన కుటుంబ సభ్యుల చికిత్స కోసం దిల్లీ వెళ్తుంటారు. గతంలోనూ కేసీఆర్ దిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సతీమణి శోభ దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స చేయించుకుంటున్నారు.

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కేసీఆర్ సతీమణి శోభ ఊపిరితిత్తుల్లో సమస్యతో ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. అందుకే వైద్యం కోసం దిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లారు. ప్రియాంక గాంధీ వైద్యం కోసం దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తుంటే.. కేసీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్తోంది. అయితే.. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ప్రత్యేక సమస్యలు, స్పెషలిస్టుల సేవలు ఇందుకు కారణం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: