దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. రోజుకు 30 వేల నుండి 40 వేల మధ్య కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా వందల్లో నమోదవుతోంది. ఇదిలా ఉండగానే థర్డ్ వేవ్ రాబోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నరన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అయితే వైద్య నిపుణులు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మూడవ వేవ్ రాబోతుందని హెచ్చరించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మూడో వేవ్ ప్రారంభ దశలోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అదనామ్ ఘోబ్రేయేసస్ కూడా హెచ్చరించారు. దాదాపు 111 కు పైగా దేశాల్లో దీన్ని గుర్తించినట్టు టెడ్రోస్ వ్యాఖ్యానించడం తెలిసిందే.
మరోవైపు కేంద్రం కూడా కరోనా హెచ్చరికలను ప్రజలు పట్టించుకోవడం లేదని.... వాతావరణంలో సూచనల మాదిరిగా సులభంగా తీసేస్తున్నారని సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన డాక్టర్ సమిరన్ పాండా కీలక విషయాలు వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ మనదేశంలో ఆగస్టు చివరి వారంలో వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ చూపించినంత ప్రభావం మాత్రం ఉండకపోవచ్చని సమరిన్ భావించారు. సూపర్ స్పైడర్ సంఘటనలను నివారించడం మరియు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం పై మూడవ వేవ్ ముప్పు ఆధారపడి ఉంటుందని చెప్పారు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దశలలో ఉన్న రోగ నిరోధక శక్తి క్షీణిస్తే అది మూడో వేవ్ ముప్పుకు దారితీస్తుందని చెప్పారు. ప్రస్తుతం మనలో ఉన్న ఇమ్యూనిటీని కూడా దాటేసే వేరియంట్ వస్తే మూడవ వేవ్ కు దారితీయవచ్చని చెప్పారు. ఒకవేళ మనలో ఉన్న రోగ నిరోధక శక్తి కరోనాను నిరోధించినా అతి వేగంగా వ్యాప్తి చెందే గుణం వేరియంట్ కు ఉంటే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా కరోనా మార్గదర్శకాలను ,ఆంక్షలను ముందస్తుగా రాష్ట్రాలు ఎత్తివేస్తే మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీస్తుంది అని చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ ఇప్పటికే మన దేశంలోకి ప్రవేశించాయని కాబట్టి వాటి వల్ల ఇక ముప్పు ఉండకపోవచ్చని డాక్టర్ సమిరన్ పాండా అభిప్రాయపడ్డారు.